తెలంగాణ రాష్ట్రసమితిని ఎదిరించి రాష్ట్రమంతటా విస్తరించాలనే తలంపుతో ఉన్నారు మాజీ మంత్రి ఈటల. రాజేందర్ కు హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా బలం లేకుండా చేయాలనే ఎత్తుగడతో ముందుకెళ్తోంది గులాబీ అధిష్టానం. దీంతో.. రాజకీయం రసవత్తరంగా మారింది. ఈటల మీదకు మంత్రి గంగుల కమలాకర్ ను ప్రయోగిస్తోంది అధిష్టానం. దీంతో.. నిన్నామొన్నటి వరకు సహచరులుగా ఉన్న వారిద్దరూ మాటల ఈటెలు విసురుకుంటున్నారు. దీంతో.. హుజూరాబాద్ రాజకీయం వేడెక్కుతోంది.
ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు సానుభూతి వ్యక్తమైంది. రాజకీయంగా టార్గెట్ చేశారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. ఇక, ఈటల నియోజకవర్గం హుజూరాబాద్ లో దాదాపు 90 శాతం మంది ప్రజాప్రతినిధులు ఈటల వెంటే నిలబడ్డారు. అన్యాయంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీన్ని గుర్తించిన గులాబీదళం వారిని తమవైపు తిప్పుకునే రాజకీయం మొదలు పెట్టింది.
ఈటలతో ఉంటామని ప్రకటించిన వారిలో కొందరు.. టీఆర్ఎస్ లోనే ఉంటామని ప్రకటనలు చేస్తుండడం గమనించాల్సిన అంశం. పరిస్థితి ఇలా మారిపోవడంలో మంత్రి గంగుల కమలాకర్ పాత్ర ప్రముఖంగా ఉందనే ప్రచారం సాగుతోంది. అధిష్టానం సూచనలతో రంగంలోకి దిగిన గంగుల.. మిగిలిన విషయాలన్నీ వదిలేసి, హుజూరాబాద్ నియోజకవర్గం మీదనే దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
ఎవరైతే వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారో.. వారితో సమావేశం అవుతున్నట్టు సమాచారం. పార్టీ ఇంకా రెండేళ్లకు పైన అధికారంలో ఉంటుందని, ఈటలతో వెళ్లి భవిష్యత్ పాడుచేసుకోవద్దని సూచిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. రాజకీయ అభివృద్ధికి తాను భరోసా ఇస్తానని హామీలు ఇస్తున్నట్టు సమాచారం. దీంతో.. చాలా మంది మాట మారుస్తున్నారని అంటున్నారు.
ఓవైపు ఈ పని చేస్తూనే.. ఈటలపై నేరుగా దాడిచేస్తున్నారు కమలాకర్. టీఆర్ఎస్ లేకుంటే రాజేందర్ ఎక్కడ ఉండేవారని అంటున్నారు. పార్టీ ఆయనకు ఎన్నో పదవుల్ని ఇచ్చిందని, కానీ.. ఆయన పార్టీలో ఉంటూనే బీజేపీ, కాంగ్రెస్ నేతలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. అటు ఈటల రాజేందర్ కూడా ఎదురుదాడి చేస్తున్నారు.
తల్లిని బిడ్డను వేరు చేసేలా తన నియోజకవర్గంలోని నాయకులపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ.. అంతిమ విజయం మాత్రం ధర్మానిదే అని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ విధంగా.. హుజూరాబాద్ లో రాజకీయం రసకందాయంలో పడింది. మరి, మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.