
ఇటీవల తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ చానెల్ లో కథనాలు ప్రసారం చేశాడని అందులో పనిచేసిన రిపోర్టర్ అయిన ఒక యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చింతపండు నవీన్ పై ఓ యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సహోద్యోగి, స్నేహితుడైన చిలక ప్రవీణ్ గత కొంతకాలంగా తీన్మార్ మల్లన్న అవినీతి అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈనేపథ్యంలోనే ఫీర్జాదిగూడలోని తీన్మార్ మల్లన్న యూట్యూబ్ చానల్ పై పోలీసుల మంగళవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. ఒక్కొక్కరుగా కార్యాలయానికి చేరుకున్న పోలీసులు కార్యాలయ సిబ్బందిని బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పలు పత్రాలు పరిశీలించి హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు.
చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో తీన్మార్ మల్లన్నను పోలీసులు 5 గంటల పాటు విచారించారు. అనంతరం విడుదల చేశారు. ఈనెల 8న మరోసారి విచారణకు హాజరు కావాలని తెలిపారు. విచారణకు సహకరిస్తానని ఈ సందర్భంగా మల్లన్న స్పష్టం చేశారు.
తీన్మార్ మల్లన్న నేతృత్వంలో నడుస్తున్న ‘క్యూ న్యూస్’ చానెల్ లో తన వ్యక్తిగత ఫొటోలను చూపించి పరువుకు భంగం కలిగించారంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ 67, ఐపీసీ 506, 509 ,417 సెక్షన్ల కింద ఈనెల 2న కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫీర్జాది గూడలో ఉన్న క్యూ న్యూస్ కార్యాలయంలో సైబర్ క్రైం పోలీస్ ఇన్ స్పెక్టర్లు బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సోదాలు పలు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ డివైజ్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో క్యూ న్యూస్ ఉద్యోగులతోపాటు మరికొందరు బాధితుల వివరాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించి తీన్మార్ మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ‘క్యూ న్యూస్ చానెల్ లో నేను జనవరి 2020 నుంచి అదే ఏడాది ఆగస్టు వరకు రిపోర్టర్ గా పనిచేసినట్టు ఆమె తెలిపింది. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న విధానాలు, ట్రిక్కులు నచ్చక ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిపింది. తీన్మార్ మల్లన్న సోదరుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వెంకటేశ్ , మరికొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సహాయంతో కొన్ని అక్రమ అప్లికేషన్స్ ను రూపొందించి వాటి ద్వారా చాలా మంది వ్యక్తిగత సమాచారాన్ని క్యూ న్యూస్ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని తెలిపారు. దాని ఆధారంగా చాలా మందిపై బెదిరింపులకు పాల్పడేవాడని తెలిపారు. ఈనెల 1న ఉదయం క్యూ న్యూస్ చానెల్ లో మార్నింగ్ లైవ్ సోలో నాతోపాటు మరికొందరి అమ్మాయిల ఫొటోలను చూపాడని బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఇక తనకు చిలుక ప్రవీణ్ తో వివాహేతర సంబంధం ఉన్నట్టు చూపించాడని బాధిత యువతి తెలిపింది. చిలుక ప్రవీణ్ తో విభేదాల కారణంగా అతడిని బ్లాక్ మెయిల్ చేసేందుకు నా ఫొటోలు వాడుకున్నాడని.. ఆ వీడియోలను ‘లాడ్జ్ వ్యవహారం’ పేరిట సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.