Surat : శ్రీశ్రీ రాసిన ఒక విషయం గుర్తుందా.. ‘కుక్క పిల్లా.. సబ్బు బిల్లా.. అగ్గి పుల్లా.. కావేవి కవితకు అనర్హం’. కవి అనేవాడు వీటిపై కూడా కవిత్వాలు రాయగలడు అని చెప్పాడు. అయితే, కొందరు స్మగ్లర్లు, అక్రమ వ్యాపారులు సైతం దీన్ని అచ్చంగా పాటిస్తున్నారు.. అదేంటి కవికి వారికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండీ.. ఇప్పటి వరకు ఆహార ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, నీరు, ఇలా చాలా కల్తీ చేసిన అక్రమ వ్యాపారులు ఇప్పుడు ఏకంగా సిమెంట్ కే సూటి పెట్టారు. నకిలీ సిమెంట్ తయారు చేసి మార్కెట్లో చెలామని చేస్తున్నారు. గుప్పెడు బియ్యంలో చెంచాడు నూకలు పోస్తే పెద్దగా తెలియదు. అదే వివిధ సాధనాలతో నూనె తీస్తే పరీక్షల్లో తెలుస్తుంది. లేదంటే తెలియకపోవచ్చు. కానీ సిమెంట్ తయారు చేయడం అంటే మామూలా..? ఎన్నో మూలకాలను, మిశ్రమాలను కలిపి సిమెంట్ తయారు చేయాలి. కానీ వీరు ఏమి కలపకుండా సిమెంట్ తయారు చేసి దర్జాగా మార్కెట్లో విక్రయిస్తున్నారు కూడా.. ఇటీవల గుజరాత్ లోని సూరత్ ప్రాంతంలోని ఒక గోదాంలో ఒక్కోటి 50 కిలోల బరువున్న 410 నాసిరకం సిమెంట్ బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఒక పెద్ద సిమెంట్ కంపెనీ బ్రాండ్ తో విక్రయిస్తున్నారు. నిందితులు నాణ్యత లేని సిమెంట్‌ను బ్రాండ్‌కు చెందిన సంచుల్లో నింపి సరఫరా చేశారు. ట్రక్కు డ్రైవర్లు రాజేష్ పటేల్, మోబిన్ అలియాస్ లంబు అజిముల్లా అనే ఇద్దరు వ్యక్తులను ఖటోదర పోలీసులు ఈ రాకెట్‌లో ఉన్నారని ఆరోపిస్తూ అరెస్ట్ చేశారు. విచారణలో రూ. 1.43 లక్షల విలువైన సిమెంటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ రాకెట్‌పై సదరు సిమెంట్ కంపెనీ అధికారి నితిన్ ఠాక్రే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనిఖీ సమయంలో, ఠాక్రే మోసాన్ని గుర్తించి, ఆపై పోలీసులను అప్రమత్తం చేశాడు. పోలీసులు నిందితులను విచారించగా, సిమెంట్ నిజమైనదని రుజువు చేసేందుకు సరైన పత్రాలు సమర్పించలేకపోయారు. బ్రాండెడ్ సిమెంట్ బస్తాల్లో నాణ్యత లేని సిమెంటును నింపినట్లు వారు అంగీకరించారు. పోలీసులు అప్రమత్తం కావడంతో నిందితులు బ్రెడ్‌లైనర్ సర్కిల్ సమీపంలో సిమెంట్ బస్తాలను డెలివరీ చేసేందుకు వచ్చారు. నాణ్యత లేని సిమెంట్‌ను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు..? ఎవరు తయారు చేస్తున్నారు..? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ రాకెట్‌లో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మరికొందరికి నోటీసులు అందజేసి వారిని సైతం విచారణలో భాగం చేస్తున్నట్లు చెప్పారు. నిర్ధారణల ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారు. సిమెంట్ ఎక్కడి నుంచి సరఫరా చేశారన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న మరికొందరిని గుర్తించేందుకు నిందితుల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.
నిందితులు మగ్దల్లా పోర్ట్ సమీపంలోని ఖాళీ సంచులను సేకరించారు. వారు రవాణా సమయంలో లేదా సంచులను నింపేటప్పుడు చిందిన సిమెంట్‌ను సేకరించారు. సిమెంటును మట్టితో కలిపి బ్రాండెడ్ బ్యాగుల్లో నింపారు. ‘నిందితులు ఇటీవల నకిలీ ఉత్పత్తిని సరఫరా చేయడం ప్రారంభించారు. ఒకటి లేదా రెండు సంచులను విక్రయిస్తున్నారు. ఈసారి వారు పెద్ద మొత్తంలో సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. కంపెనీ అధికారులు దాని గురించి తెలుసుకున్నారు. పోలీసులు అప్రమత్తమయ్యారు.’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు.