Hyderabad: మత్తెక్కించే డ్రగ్స్, కైపు ఎక్కించే అమ్మాయిలు, హోరెత్తించే డిజె సౌండ్…ఆ ఊపు లో ఏం జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఇదేదో ఢిల్లీ, ముంబై, గోవా లాంటి ప్రాంతాల్లో కాదు జరిగేది. మన హైదరాబాదులోనే. ఇటువంటి విష సంస్కృతి మన నగరానికి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఒకప్పుడు వ్యభిచారానికి పరిమితమైన ముఠాలు చీకటి వ్యాపార విస్తరణకు డ్రగ్స్ బాట పడుతున్నాయి. మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్ టీ యూ) వ్యభిచార ముఠా లో కీలక సభ్యుడు సోఫిన్ అబ్బాస్ ను అరెస్టు చేయడంతో ఈ దారుణం బయటపడింది. ఈ నిందితుడు దేశ, విదేశాల నుంచి యువతులను రప్పించడంతో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.
రిసార్ట్స్ అడ్డాగా
జూబ్లీహిల్స్ పబ్ కేసులో ఒక మైనర్ పై అత్యాచారం జరిగిన తర్వాత పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దీంతో పబ్ ల నిర్వాహకులు చీకటి వ్యాపారానికి స్వస్తి పలికారు. అయితే ఇందులో అధికార పార్టీ నాయకులకు చెందిన పబ్ లలో మాత్రం దందాలు దర్జాగా సాగుతున్నాయి.. అయితే అక్రమ సంపాదనకు అలవాటు పడిన ముఠాలు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని రిసార్టులను ఇందుకు అడ్డగా మలుచుకుంటున్నాయి. వారాంతపు పార్టీల పేరుతో రకరకాల వ్యవహారాలకు తెరతీస్తున్నాయి.
డబ్బున్నవారే టార్గెట్
హైదరాబాదులో శ్రీమంతులను టార్గెట్ గా చేసుకొని ఈ ముఠాలు చీకటి పనులకు పాల్పడుతున్నాయి. పార్టీ పేరుతో పిలవడం, డ్రగ్స్ సరఫరా చేయడం, అమ్మాయిలను వారి వద్దకు పంపడం పరిపాటిగా సాగుతోంది.. ఈ వ్యవహారంలో కోట్ల కొద్ది డబ్బు చేతులు మారుతోంది. హైదరాబాద్ హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతంలో ఉండటం, పైగా నిర్మానుష్య ప్రాంతం కావడంతో నిర్వాహకులు దర్జాగా తమ చీకటి దందాను సాగిస్తున్నారు.. ఇక్కడ యువతులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అందమైన అమ్మాయిలను తీసుకొస్తున్నారు. వారికి హై ఫై లైఫ్ స్టైల్ అలవాటు చేయించి మెల్లిగా ఈ ముగ్గులోకి దింపుతున్నారు.
బయట పడుతున్న వాస్తవాలు
ఇటీవల హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కొన్ని రి సార్ట్ ల పై పోలీసులు ముక్కు మట్టి దాడులు చేశారు. ఈ సందర్భంగా పలువురు యువతుల్ని, యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో వారి వద్ద భారీగా డ్రగ్స్, మత్తు పదార్థాలు కనిపించడం విశేషం. అయితే ఇలాంటి కేసుల్లో మొదట హడావిడి చేస్తున్న పోలీసులు తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. ప్రభుత్వ పెద్దల్లో కొంతమందికి చీకటి వ్యాపారం చేసే వారితో సంబంధం ఉన్న నేపథ్యంలోనే చర్యలు తీసుకోకుండా పోలీసులు మిన్నకుంటున్నారని తెలుస్తోంది.. ఇలాంటి పార్టీలకు మైనర్లు కూడా వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలకు చెందిన శ్రీమంతులు ఇలాంటి పార్టీల్లో పాల్గొంటున్నారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ చీకటి వ్యాపారం సాగించేవారు గోవా, ప్రాంతం నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారని తెలుస్తోంది. గతంలో గోవా డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ అరెస్ట్ అయినప్పుడు చాలా సంచలన విషయాలు బయట పెట్టాడు. అయితే అందులో కీలకమైన ప్రభుత్వ పెద్దలు ఉన్న నేపథ్యంలో చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడారు. మరి ఇప్పుడు వరుస దాడులు చేస్తున్నప్పటికీ.. ఇలాంటి చర్యలు తీసుకున్నారో పోలీసులు మాత్రం చెప్పడం లేదు.. అంటే ఇవి కూడా రెండు రోజుల హడావుడి బాపతేనా?