Police thieves : పోలీస్.. సమాజంలో ఈ ఉద్యోగానికి చాలా విలువ ఉంటుంది. శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తారు.. కానీ దొంగలను పట్టుకోవాల్సిన పోలీస్ దారి తప్పాడు. ఏకంగా స్టువర్టుపురం దొంగల ముఠాతో సంబంధం పెట్టుకున్నాడు. ఇతడికి ఒకరిద్దరి అధికారుల అండదండలు కూడా ఉన్నాయి.. ఇంకేముంది పేట్రేగి పోయాడు. కోట్లకు పడగలెత్తాడు. తిలాపాపం తల పిడికెడు అన్నట్టు.. దొంగలతో సంబంధాలు పెట్టుకుని ఆ పోలీస్, మిగతా అధికారులు దర్జాగా వెనకేసుకున్నారు. ఇప్పుడు వారి పాపం పండింది.. వారు చేసిన అక్రమాలు బయటపడ్డాయి. విచారణ చేస్తున్న అధికారులకు షాక్ అయ్యే నిజాలు తెలిశాయి.
అతని పేరు ఈశ్వర్
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. ఆ సామెతను ఈ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఈశ్వర్ నిజం చేశాడు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసు ఉద్యోగంలో ఉండి.. దొంగ అవతారం ఎత్తాడు. స్టువర్టుపురం ముఠాతో సంబంధాలు పెట్టుకున్నాడు. దర్జాగా సంపాదించాడు.. ఈశ్వర్ హైదరాబాదులో కీలకమైన ఎస్ఆర్ నగర్, నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసి.. ప్రస్తుతం పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ విభాగంలో సేవలందిస్తున్నాడు. దొంగలతో సంబంధాలు పెట్టుకుని కోట్ల ఆస్తులు కూడబెట్టాడు. ఆ దొంగల ముఠా తో ఎన్నో దొంగతనాలు చేయించాడు. బంగారం నుంచి సెల్ ఫోన్లు దాకా.. అయితే ఇదే క్రమంలో అతడు ఇటీవల నల్లగొండ జిల్లాలో సెల్ ఫోన్లు చోరీ చేయించాడు. కానీ ఇక్కడే అతడి పాపం పండింది.
ఇలా చిక్కాడు
ఇటీవల నల్లగొండ జిల్లాలో సెల్ ఫోన్ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి శైలిలో విచారించగా అసలు విషయాలు వెల్లడించారు. తమకు, కానిస్టేబుల్ ఈశ్వర్ కు సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నారు. తమకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడని, కీలక అధికారులు కూడా సహకారం అందిస్తున్నారని వారు వివరించారు.. తమతో పాటు దొంగతనాలు చేస్తున్నారని ఒప్పుకున్నారు.. ఈశ్వర్ తమతో చేయించిన దొంగతనాల చిట్టాను వివరించారు. దీంతో నివ్వెర పోవడం నల్లగొండ పోలీసుల వంతు అయింది. అయితే ఈ వ్యవహారంలో కొందరు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నట్టు పోలీసులకు విచారణలో తేలింది.. దొంగతనాలు చేయగా దోచుకున్న సొత్తును కాపాడే బాధ్యత ఈ పోలీసులు తీసుకున్నట్టు తెలుస్తోంది. దొంగ సొత్తును హైదరాబాదులోని జగదీష్ మార్కెట్లో విక్రయించే వాళ్ళని సమాచారం.. ఇలా విక్రయించగా వచ్చిన సొమ్మును ఎవరి వాటా వాళ్లు పంచుకునేవారు అని తెలుస్తోంది.. కేవలం ఇలా దొంగతనాలు చేసిన సొమ్ముతో కోట్లకు పడగలెత్తారు అంటే ఏ స్థాయిలో వారి హవా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రగతి భవన్ నుంచి ఫోన్
ఈ వ్యవహారం ప్రగతి భవన్ దాకా వెళ్లడంతో.. సీఎం పేషీ నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కు ఫోన్ వెళ్ళింది.. దీంతో ఆయన ఆగ మేఘాల మీద ఈ కేసు కు సంబంధించిన నివేదిక తెప్పించుకున్నారు.. అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు.. విచారణ ప్రారంభించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఈ దొంగతనాల్లో పోలీస్ అధికారుల పాత్ర ఉన్నట్టు నిగ్గు తేల్చారు. వీరిలో ఒక ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇన్స్పెక్టర్ హైదరాబాద్ సిపి కార్యాలయంలో ఓ విభాగంలో పనిచేస్తున్నారు. మరో ఇద్దరు ఎస్ఐల పాత్రను కూడా ఎస్ బీ అధికారులు నిర్ధారించారు. అయితే నేడో, రేపో వారిపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Police looting with thieves
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com