Bandi Sanjay Padayatra- KCR: టిఆర్ఎస్, బిజెపి మధ్య తెలంగాణలో యుద్ధం కొనసాగుతూనే ఉంది.. కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఇరు పార్టీలు రగడ సృష్టిస్తున్నాయి. 2018 నుంచి రాష్ట్రంలో ఇదే తంతు కొనసాగుతోంది.. కొన్నిసార్లు అయితే పతాక స్థాయికి వెళ్తోంది. తాజాగా సోమవారం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత బైంసా నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను బండి సంజయ్ ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. నిన్న సాయంత్రం బైంసాకు బయలుదేరిన బండి సంజయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. తనకు అనుమతులు ఉన్నాయని చెప్పినా కూడా వినిపించుకోలేదు. పోలీస్ బలగాలు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. దీంతో బండి సంజయ్ తిరిగి కరీంనగర్ వెళ్లక తప్పలేదు.

ఎందుకు అడ్డుకున్నారు
బైంసా సున్నిత ప్రాంతమని, పాదయాత్ర చేస్తే పరిస్థితులు అదుపు తప్పవచ్చని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇంటలిజెన్స్ నివేదిక ప్రకారం తాము నడుచుకుంటున్నామని పోలీసులు అంటున్నారు.. అయితే బైంసాలో తాను పాదయాత్ర చేస్తే భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా లబ్ధి జరుగుతుందనే ఉద్దేశంతో కెసిఆర్ ఇంటెలిజెన్స్ నివేదిక పేరుతో నాటకాలు ఆడుతున్నారని సంజయ్ ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పాదయాత్ర చేస్తానని తేల్చి చెబుతున్నారు. పోలీసుల సూచన మేరకు నిన్న కరీంనగర్ వచ్చిన బండి సంజయ్.. ఇవాళ మధ్యాహ్నం దాకా పాదయాత్ర అనుమతి కోసం ఎదురు చూడాలని నిర్ణయించుకున్నారు.. ఒకవేళ అలా జరగని పక్షంలో కోర్టుకు వెళ్లాలి అనుకుంటున్నారు. గతంలో కూడా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి బండి సంజయ్ వెళ్లకుండా ప్రభుత్వం నిలువరించింది. కానీ ఆయన కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నారు. సారి కూడా ఆయన మళ్లీ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.
ఎందుకు నిలిపేసినట్టు
బండి సంజయ్ ని భైంసా వెళ్లకుండా ప్రభుత్వం నిలువరించడం ఇది మొదటిసారి కాదు.. గతంలో హిందూ_ ముస్లింల మధ్య గొడవలు జరిగినప్పుడు… బాధిత హిందూ కుటుంబాలను పరామర్శించేందుకు బండి సంజయ్ భైంసా వెళ్లారు. శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఇది పెద్ద రచ్చకు దారి తీసింది. కొద్దిరోజుల తర్వాత ఆయన భైంసా వెళ్లారు. హిందు వాహిని సంస్థ సేకరించిన విరాళాలను బాధిత కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అప్పట్లో ఆయన బైంసా వెళ్ళినప్పుడు ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2019లో సోయం బాపురావు ద్వారా ఎంపీ స్థానం గెలుచుకుంది.. ఇప్పటినుంచి ఇప్పటిదాకా పార్టీని విస్తరించే పనిలో ఉంది.. అయితే ఇది నచ్చని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోంది.. ఇదే క్రమంలో భైంసాలో అల్లర్లు జరిగాయి.. అయితే దీనిని మొదట్లో రెండు వర్గాల మధ్య గొడవలుగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ బిజెపి ఊరుకోకుండా అసలు విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఇది సాక్షాత్తు కేంద్ర హోం శాఖ దాకా వెళ్ళింది.. ఇక అప్పటినుంచి దీనిని సున్నితమైన ప్రాంతంగా పోలీసులు పరిగణిస్తున్నారు. హిందూ ముస్లింల పండుగప్పుడు 144 సెక్షన్ విధిస్తున్నారు. ఇలాంటి సమయంలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తే ఘర్షణలు చెలరేగుతాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. అయితే పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో బండి సంజయ్ కరీంనగర్ వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం వరకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వని పక్షంలో ఆయన కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు.