తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి, ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఆరేళ్ల సర్వీసు ఉన్న ఆయన.. తన ఐపీఎస్ సర్వీసును వదులుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, కాన్షీరాం మార్గంలో పయనిస్తానని చెప్పారు. గురుకులాల కార్యదర్శిగా ఏళ్ల తరబడి పనిచేసిన ప్రవీణ్ కుమార్.. మచ్చలేని సేవలు అందించారు. అయితే.. ఆయన తన పదవికి రాజీనామా చేయడం.. ఇటు వెంటనే ఆయనపై కేసు నమోదు కావడం సంచలనం కలిగిస్తోంది. అసలు ఏం జరిగిందంటే..
ఈ ఏడాది మార్చిలో పెద్దపల్లి జిల్లా జూలపెల్ల మండలం ధూలికట్ట గ్రామంలో స్వేరోస్ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ ముఖ్యతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వేరోస్ సభ్యుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్ బాబు భీమ్ ప్రతిజ్ఞ చేయించారు. ఇది స్వయంగా అంబేద్కర్ రాసి, చేసిన ప్రతిజ్ఞగా చెబుతున్నారు. ఇది హిందూ మతానికి వ్యతిరేకంగా ఉందంటూ.. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉందంటూ కరీంనగర్ లో కేసు నమోదైంది.
ప్రవీణ్ కుమార్ కొన్ని వర్గాలను కించపరిచేలా వ్యవహరించారంటూ.. లాయర్ భేతి మహేందర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. మరి, ఇంతకూ ఆ ప్రతిజ్ఞలో ఏముందన్నది చూస్తే…
‘‘హిందూ దేవుళ్లైన రాముడి మీద, కృష్ణుడి మీద నమ్మకం లేదని, వాళ్లను పూజించమని, గౌరీ మీద, గణపతి మీద, ఇతర హిందూ దేవతల మీద నమ్మకం లేదని, వాళ్లను పూజించమని, శ్రాద్ధ కర్మలు పాటించమని పిండదానాలు చేయబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము’’ అంటూ సాగింది. ఇది హిందూ మతాన్ని అవమానించడమేనని అప్పట్లో చర్చ జరిగింది. అదే అంశంపై ఇప్పుడు కేసు నమోదైంది. మరి, దీనిపై ప్రవీణ్ కుమార్ ఏవిధంగా స్పందిస్తారు? అన్నది చూడాలి.