PM Modi Visakha Tour: ఏపీలో ఏది జరిగినా తమ చేతుల్లో జరగాలని సీఎం జగన్ భావిస్తారు. అందునా ప్రచారం లభిస్తుందంటే ఎటువంటి కార్యక్రమానికి వెనుకడుగు వేయరు. రేషన్ పంపిణీ చేసే వాహనాల నుంచి 104 అంబులెన్స్ ల వరకూ పరేడ్ నిర్వహించి మరీ స్వస్థలాలకు పంపించిన చరిత్ర ఆయనది. గతంలో ఇటువంటి ప్రారంభోత్సవాలకు ఏ ప్రభుత్వమూ ఆర్భాటం చేయలేదు. ఓన్ అండ్ ఓన్లీ జగన్ మాత్రమే అటువంటి పనులకు పురమాయిస్తూ ప్రజల వద్ద మార్కులు కొట్టేయ్యాలని భావించారు. అయితే ఇప్పుడు ఏపీకి ప్రధాని మోదీ వస్తున్నారు. ఇప్పడు కూడా బీజేపీ నేతల కంటే వైసీపీ నాయకులే హల్ చల్ చేస్తున్నారు. కార్యక్రమాల నిర్వహణ నుంచి జన సమీకరణ వరకూ వారు చేస్తున్న హడావుడి చూసి కాషాయ దళం సైతం ముక్కున వేలేసుకుంటుంది. విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రివ్యూల మీద రివ్యూలు పెడుతున్నారు. ప్రధాని వచ్చేది సెంట్రల్ గవర్న్ మెంట్ ప్రోగ్రామ్స్ కే అయినా.. లోకల్ ఎంపీ జాడ లేకపోవడం మాత్రం విశేషం.

అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని హాజరైన సంగతి తెలిసిందే. ఒక వ్యూహం ప్రకారం చిరంజీవిని ముందుపెట్టి కార్యక్రమం నడిపించిన జగన్ కు విశాఖలో మాత్రం ఆ చాన్స్ ఇవ్వకూడదని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. అందుకే అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు బీజేపీ నేతలు ఆహ్వానించినట్టు తెలిసింది. ప్రధాని పర్యటనకు ప్రత్యేక ఆహ్వానం పంపినట్టు సమాచారం. అల్లూరి విగ్రహావిష్కరణకు పవన్ కు ఆహ్వానం అందింది. అయితే పవన్ వస్తే తనకు ఇబ్బందులు వస్తాయని జగన్ కేంద్ర పెద్దల వద్ద మొర పెట్టుకున్నారుట. అయితే నాడు పవన్ కూడా సమావేశానికి హాజరయ్యేందుకు పెద్దగా ఆసక్తిచూపలేదు. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సైతం ప్రధాని దగ్గరకు వెళ్లే అవకాశమివ్వకుండా అవమానించారు. చివరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అందుకే ఈసారి అటువంటి తప్పిదాలకు అవకాశం లేకుండా కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలన్నీ ప్రధాన మంత్రి కార్యాలయమే చూసుకుంటోంది.
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కు కేంద్ర పెద్దలు ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఇటీవల కేంద్రం తీరుపై పవన్ ఓకింత అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే వ్యూహం మార్చుకుంటానని పవన్ గట్టి హెచ్చరికలే పంపారు. దీంతో కేంద్ర పెద్దలకు తత్వం బోధపడింది. అటు ఏపీలో బీజేపీ మెజార్టీ వర్గం సైతం పవన్ ను దూరం చేసుకుంటే పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతాయన్న హెచ్చరికలు కూడా బీజేపీ పెద్దల్లో మార్పునకు కారణం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పవన్ ను వదులు కోవడానికి వారు ఇష్టపడడం లేదు. ప్రధాని మోదీ పర్యటనతో పవన్ కు మరింత దగ్గరయ్యేందుకు వ్యూహం రచిస్తున్నారు. అయితే గత మూడున్నరేళ్లుగా బీజేపీతో కలిసి నడిచినా.. కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నా.. పవన్ హుందాగా వ్యవహరిస్తూ వచ్చారు. వారికి ఇబ్బందులు తెచ్చే ఏపనిచేయలేదు. ప్రధానిని కలిసేందుకు వెంపర్లాడలేదు. అయితే తాజాగా అందుకున్న ప్రత్యేక ఆహ్వానం మేరకు విశాఖ వెళాతారా? లేదా సున్నితంగా తిరస్కరిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

ఈ తాజా పరిణామాలు సీఎం జగన్ కు మింగుడుపడడం లేదు. పవన్ కు కేంద్ర పెద్దలు ప్రాధాన్యమివ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధాని పర్యటనకు మేము ఏర్పాట్లు చేస్తుంటే.. పవన్ కు ఆహ్వానం అందించడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఏపీలో పరిణామాలు మారుతున్న క్రమంలోనే బీజేపీ స్టాండ్ మార్చింది. బీజేపీ పెద్దల రూట్ మ్యాప్ కోసం వేచిచూశానని. కానీ జాప్యం జరుగుతోందని పవన్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అటు పవన్ కూడా ప్రభుత్వంపై ఎదురుడి దాడి చేస్తుండడంతో.. కేంద్ర పెద్దల సహకారంపై జగన్ అనుమానిస్తున్నారు. తనపై పవన్ ను ప్రయోగిస్తున్నారని భయపడుతున్నారు. చూడాలి ప్రధాని విశాఖ పర్యటన తరువాత రాజకీయ పరిణామాలు మారే అవకాశమైతే కనిపిస్తోంది.