PM Modi- Chandrababu: ఎన్నికల సమీపిస్తున్న కొద్ది పొత్తుల ఎత్తులు రసవత్తరంగా మారాయి. కలిసొచ్చే పార్టీలను దగ్గరగా ఉంచుకుంటూనే, మొదటి నుంచి కేంద్రంలోని బీజేపీ ద్వంద ప్రమాణాలను పాటిస్తూ వస్తున్నది. రెండు రోజుల క్రితం బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా పొత్తుల ప్రస్తావనపై జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఇరు పార్టీలు అటువంటిదేమి లేదని తేల్చి చెప్పేశారు.
రాష్ట్రంలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు గెలుపు కోసం అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. వైసీపీ నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ టీడీపీ, జనసేన నాయకులు గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో అన్నారు. అందుకోసం టీడీపీని బీజేపీకి దగ్గర చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో పొత్తుల అంశంపై కూడా చర్చలు జరిగినట్లుగా చెబుతున్నాయి.
బీజేపీతో పొత్తు పెట్టుకొని 2014లో టీడీపీ పోటీ చేసింది. గెలిచిన తరువాత ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు క్యాబినెట్ లో చంద్రబాబు అవకాశం కూడా కల్పించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో బీజేపీకి తెలుగుదేశం దూరంగా జరిగింది. ఇందుకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చేసిన రాద్ధాంతమే కారణం. ప్రత్యేక హోదా తీసుకురావాల్సిందేనని పెద్ద ఎత్తున జగన్ పెద్ద ఉద్యమమే తమ పార్టీ నాయకులతో చేయించారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన ప్రత్యేక హోదా అని కనీసం బీజేపీ నేతలను బలంగా అడిగిన పాపాన పోలేదు.
2024 ఎన్నికల్లో గెలుపోటలమును రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ వైఫల్యాలను టీడీపీ ప్రజల్లోకి బాగానే తీసుకువెళ్తుంది. అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం పార్టీనేనని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపు జగన్ కేంద్రంలోని బీజేపీతో లోపాయికారీగా పొత్తును కొనసాగిస్తున్నారు. ఇటువంటి తరుణంలో తమతో బీజేపీ నేతలు ఎక్కడ తమతో కటీఫ్ అవుతారోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో ఉంది. చంద్రబాబుతో బీజేపీ పెద్దలు భేటీని మిగతా పార్టీల కంటే వైసీపీనే ఎక్కువగా మాట్లాడింది. పొత్తు కుదరలేదనే అంశం బయటకు వచ్చిన తరువాత పట్టలేని ఆనందాన్ని సాక్షిలో మీడియాలో కనబడింది.