Margadarsi Case: మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలపై జగన్ సర్కారు రామోజీరావును వెంటాడుతోంది. ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రామోజీరావును సీఐడీ విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల మార్గదర్శి సంస్థకు చెందిన ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శికి సంబంధించిన మొత్తం రూ.798.50 కోట్ల విలువైన చరాస్తులు అటాచ్ చేయగలిగింది. దీంతో ఈ కేసు సంచలనాలకు వేదికగా మారింది. తండ్రి రాజశేఖర్ రెడ్డి సైతం వ్యవహరించలేని విధంగా జగన్ దూకుడు కనబరచడం విశేషం. ఎలాగైనా రామోజీరావును ప్రజాకోర్టులో నిలబెట్టాలన్న స్ట్రాంగ్ డిసైడ్ తోనే జగన్ కఠిన చర్యలకు దిగుతున్నారు.
తాజాగా రామోజీరావు కొడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ను ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రామోజీరావు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు చేరుకున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. చందాదారుల నుంచి సేకరించిన నగదు ఎక్కడికి తరలించారన్న కోణంలో ఆమెను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. చిట్ ల కింద సేకరించిన సొమ్మును రామోజీ గ్రూప్ కంపెనీలకు మళ్లించినట్టు సీఐడీ అధికారులు ఇది వరకే గుర్తించారు. దానిపైనే ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది.
అయితే చందాదారుల నుంచి ఫిర్యాదుదారులే లేని కేసులో సీఐడీ పట్టుబిగిస్తోంది. చైర్మన్, ఎండీ, ఇతర ఆడిటర్లు మొత్తం అవినీతితో పాటు కుట్రకు పాల్పడినట్టు సీఐడీ అభిప్రాయపడుతోంది. చందాదారుల నుంచి చిట్స్ ద్వారా సేకరించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్లు సీఐడీ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం మార్గదర్శిలో క్రియాశీలకంగా ఏపీలో 1989 చిట్స్ గ్రూప్లు తెలంగాణలో 2316 చిట్స్ గ్రూపులు ఉన్నాయని గుర్తించారు. చిట్ పాడుకున్న చందాదారులకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేదని గుర్తించారు. అందుకే చందదారుల కోసం మార్గదర్శి చరాస్తులు రూ.798 కోట్లను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గతంలో శైలజపై సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేయగా.. తెలంగాణ హైకోర్టు వాటిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ ఎండీ శైలజా కిరణ్ ను విచారించడం విశేషం.