PM Modi Says Empires Of Terror Temporary: అఫ్గనిస్తాన్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశం యావత్తు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్(Taliban) ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో అక్కడి నుంచి తమ పౌరులను తీసుకొచ్చేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాలిబన్ల తీరుపై ప్రధాని మోడీ(PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో చెడు ఎంతో కాలం నిలవదని పేర్కొన్నారు. తీవ్రవాదం పునాదులపై సామ్రాజ్యాలు ఏర్పాటు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. మానవత్వాన్ని ఎంతో కాలం అణచిపెట్టి ఉగ్రవాదం పైచేయి సాధించడం కుదరదని పేర్కొన్నారు.
భారత విదేశాంగ శాఖ అఫ్గాన్ లో చిక్కుకుపోయిన తమ వారిని రప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. అఫ్గాన్ లో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. తాలిబన్లతో భవిష్యత్ ఎలా ఉండబోతోందన్న దానిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని పేర్కొన్నారు. అక్కడ తాలిబన్ల వైఖరిపై ఆలోచిస్తున్నామని చెప్పారు. మన వారిని మన దేశానికి రప్పించడమే ప్రధాన ధ్యేయంగా చేసుకున్నామన్నారు.
అఫ్గాన్ లో తాలిబన్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఇంటిని గాలిస్తూ అక్కడి పౌరుల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు. అమెరికాకు సహకరిస్తున్న వారి జాడ కనుగొనే నపంతో వారి ఆగడాలు పెరిగిపోతున్నాయని అమెరికా విడదుల చేసిన ఓ తాజా పరిశోధనా పత్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇతర దేశాలకు సహకరిస్తున్నారనే ఉద్దేశంతో పౌరుల ఇళ్లలో సోదాలు చేస్తూ తాలిబన్ల తీరుపై ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే తాలిబన్లు మాత్రం పౌరుల ఇళ్లలోకి చొరబడొద్దని తమ వారికి ఆంక్షలు విధించినట్లు చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా దేశంలో పౌరులను క్షమించనున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. మహిళలు సైతం ప్రభుత్వంలో చేరాల్సిందిగా కోరుతున్నారు. అయితే తాలిబన్ల మాటలు నమ్మేందుకు భారత్ మాత్రం సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాలిబన్ల తీరుపై అక్కడి ప్రజల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. వారి రాక్షస పాలన గురించి భయాందోళన కలుగుతోంది.