PM Modi- Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో ఏపీలో రాజకీయాలు వేగంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు ఒక లెక్క… ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా అధికార వైసీపీ పరిస్థితి మారబోతోంది. అధికార పార్టీపై ఇకపై నిరంతర పోరాటం తప్పదా అంటే అవుననే అంటున్నాయి జనసేన, బీజేపీ వర్గాలు. ఇన్నాళ్లూ.. పరోక్షంగా కేంద్రానికి మద్దతు ఇస్తూ వచ్చిన వైసీపీతో దోస్తీ తెంచుకోవాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అధికారిక పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. తన మిత్రుడైన జన సేనాని పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం.

జన సేనానికి సర్వాధికారాలు..
ఏపీలో 2014 నుంచి జనసేన బీజేపీతో మైత్రి కొనసాగిస్తోంది. గతంలో టీడీపీతో కలిసి ఈ మైత్రి కొనసాగగా, 2019 తర్వాత బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయి. తాజాగా ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఏపీలో అధికార పార్టీ వైఫల్యాలను జనసేనాని ఎండగడుతున్నారు. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా.. ప్రతపక్ష పాత్ర పోషిస్తున్నారు. ప్రజాసమస్యలపై పోటాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో పవన్.. బీజేపీని కూడా దూకుడు పెంచాలని సున్నితంగా హెచ్చరించారు. తాను ఆశించిన మేరకు బీజేపీ ఏపీలో పోరాటం చేయడం లేదని సున్నితంగా హెచ్చరించారు. ఇలాగే ఉంటే.. తన దారి తాను చూసుకుంటానని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా పవన్‌కు మోదీ నుంచి పులుపు వచ్చింది. ఇద్దరి మధ్య సుమారు గంటపాటు సమావేశం జరిగింది. ఇందులో పవన్‌కు ప్రధాని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని తెలుస్తోంది.
షెడ్యూల్ పదినిమిషాలే.. సమావేశమైంది.. అరగంట!
ప్రధాన మంత్రి ఏపీ పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి షెడ్యూల్ కంటే గంట ఆలస్యంగా విశాఖ చేరుకున్నారు మోదీ. ఈ సందర్భంగా మొదట కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తర్వాత పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని–పవన్ సమావేశం కేవలం పది నిమిషాలే. కానీ.. ఎవరూ ఊహించని విధంగా సుమారు 30 నిమిషాలు మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఇది ఆంధ్రా అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అరగంట సమావేశంలో చర్చించిన అంశాలు ఏమై ఉంటాయా అని ఆరా తీస్తోంది. అయితే ఈ సమావేశంలో బీజేపీ–జనసేన మైత్రి, ఏపీ సర్కార్ అవినీతి, విశాఖ అభివృద్ధి, మూడు రాజధానుల అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అధికార పార్టీ వైఫల్యాలపై ప్రధానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ నివేదికను పూర్తిగా చదివిన ప్రధాని ఏపీ సర్కార్‌పై పోరాటానికి పవన్ కళ్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలుస్తోంది.

పవన్ పోరాటం షురూ..
ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటన ముగియక ముందే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కార్‌పై యుద్ధం మొదలు పెట్టారు. సీఎం జగన్ విశాఖ బహిరంగసభలో ఉండగానే పవన్ పోరాటం షురూ చేశారు. అనే హ్యాష్ ట్యాగ్‌తో పవన్ కళ్యాణ్ ఫైట్ స్టార్ట్ చేశారు. జగనన్న ఇళ్లు..పేదలందరికీ కన్నీళ్లు అంటూ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దీంతో ప్రధానితో భేటీలో పవన్‌కు ఫ్రీ హ్యాండ్ లభించిందన్న చర్చ జోరందుకుంది.