కరోనా
మహమ్మారిపై అలుపెరగని పోరాటం జరుపుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అండగా వైద్యులు, శాస్త్రవేత్తలు, ఆర్ధికవేత్తలతో కూడిన 30 మంది నిపుణుల బృందం నిర్విరామంగా అవసరమైన సమాచారాన్ని సమకూరుస్తూ సహాయకారిగా ఉంటున్నది.
ప్రతి వారు ఒకొక్క ప్రత్యేక బృందానికి నేతృత్వం వహిస్తూ విధానాల రూపకల్పన, క్షేత్రస్థాయి వాస్తవాలను సమీకరించడంలో అండగా ఉంటున్నారు. వీరు ప్రధానంగా రెండు బృందాలుగా వ్యవహరిస్తున్నారు. తిరిగి ఇద్దరు, ముగ్గురు కలసి వేర్వేరు బృందాలుగా పనిచేస్తున్నారు.
మొదటి బృందానికి నీతి ఆయోగ్ సభ్యుడు డా. వి కె పౌల్ నేతృత్వం వహిస్తున్నారు. నిముషం, నిముషానికి ఈ బృందం అందించిన సాంకేతిక సమాచారంతో ప్రధాని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సహకరిస్తున్నారు. ప్రజలలో వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతున్నది, రాబోయే రోజులలో ఏమేరకు వ్యాప్తి చెంది అవకాశాలు ఉన్నాయి, రాగాల పరిణామాలు ఏమిటి వంటి అంశాలపై సమాచారం అందిస్తుంది.
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్, ఎఐఐఎంఎస్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా, ఐసిఎంఆర్ డైరెక్టర్ డా. బలరాం భార్గవ్ వంటి వారు ఈ బృందంలో ఉన్నారు. వీరికి మద్దతుగా మైక్రో బయాలజీ నిపుణులు డా. రామన్ గంగఖాడేకర్, డా. నివేదిపై గుప్త వంటి వారు ఉన్నారు. ఇన్స్టిట్యూట్ అఫ్ ఎపిడెమియోలజీ ద్వారా ప్రతి రోజు ప్రధానికి వైరస్ గురించిన నివేదిక అందిస్తారు.
రెండు బృందంలో పది మంది నిపుణులు ఉన్నారు. వారికి ప్రధాని సాంకేతిక సలహాదారుడు కె విజయ్ రాఘవన్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందాలను మార్చ్ మొదట్లోనే ఏర్పరిచారు. అప్పటి నుండే పనిచేస్తున్నాయి.
ప్రధాని ప్రిన్సిపాల్ కార్యదర్శి పి కె మిశ్ర ద్వారా వారు తమ సాంకేతిక నివేదికలను సమర్పిస్తుంటారు. ముఖ్యమైన అంశాలపై ప్రధాని నేరుగా వారిని సంప్రదించి వివరణలు కోరుతూ ఉంటారు. ఈ బృందంలోని ప్రతి వారితో అవసరాన్ని బట్టి ఆయన సంప్రదింపులు జరుపుతూ ఉంటారు.
21 రోజుల లాక్ డౌన్ ప్రకటనకు ముందు సమిష్టిగా పెద్ద ఎత్తున పరిశోధన చేశారు. మొదట 14 రోజులు మాత్రమే చేద్దామనుకున్నారు. అప్పటికే వైరస్ పూర్తిస్థాయిలో దేశంలోకి ప్రవేశించడంతో అది సరిపోదని నిర్ణయానికి వచ్చారు. మొదట్లో ఇతర దేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే వైరస్ పరీక్షలు జరపాలి అనుకున్నారు. కానీ ఆ తర్వాత వారితో సంబంధం గల వారందరికీ కూడా జరపాలని ఐసిఎంఆర్ నిర్ణయించింది.
ఈ నిపుణుల బృందాలతో పాటు ప్రధాని ప్రతిష్టాకరమైన పరిశోధన సంస్థలు సిఎస్ఐఆర్, డిఆర్డిఓ, సిసిఎంబి, ఐసిఎంఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ, ఇంస్టిట్యూట్ట్ అఫ్ ఫిజిక్స్, ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ వంటి సంస్థలతో సహితం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.
ప్రతి కుటుంబంపై, ముఖ్యంగా పేదలు, చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమలు. మధ్యతరగతి/జీతాలు పొందే వర్గాలుపై పడుతున్న ప్రభావాన్ని స్వయంగా అంచనా వేస్తూ ఇఎంఐ లకు వెసులుబాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకొంటున్నారు. నిత్యం 18 గంటల పాటు పనిచేసే ఆయన ప్రస్తుత సమయంలో 22 గంటల వరకు పనిచేస్తున్నారు.