Pilot Rohit Reddy: ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలి. తన నియోజకవర్గం కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వంతో కొట్లాడాలి. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన కోసం తాపత్రయపడాలి. అలాంటప్పుడే అతడు ప్రజా నాయకుడు అనిపించుకుంటాడు. ప్రజలు కూడా అతడిని తమ గుండెల్లో పెట్టుకుంటారు. కానీ ఇదేం విడ్డూరమో.. ఈ నాయకుడు మాత్రం కొంచెం డిఫరెంట్. ఏ పని చేయకున్నా విపరితమైన ప్రచారాన్ని కోరుకుంటాడు. తరచూ విలువల గురించి మాట్లాడే ఇతడు ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలోకి వెళ్లిపోయాడు.. పైగా అనేక చీకటి వ్యాపారాల్లో తలదూర్చాడు. ఇప్పుడు ఒక వివాదాస్పద పనిచేసి వార్తల్లో వ్యక్తి అయ్యాడు.
ఫామ్ హౌస్ ఎమ్మెల్యే
ఆ మధ్య మొయినాబాద్ లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కీలకంగా వినిపించిన పేరు రోహిత్ రెడ్డి. ఈయన 2018 ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచాడు. తర్వాత భారత రాష్ట్ర సమితిలోకి వెళ్ళాడు. తాండూరు మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు పట్నం మహేందర్ రెడ్డి తో ఢీ అంటే ఢీ అన్నాడు. ఈ పంచాయితీలు భారత రాష్ట్ర సమితి పెద్దల వరకు వెళ్లాయి. పద్ధతి మార్చుకోవాలని రోహిత్ రెడ్డికి హెచ్చరికలు కూడా వెళ్లాయి. అయినప్పటికీ అతడు మారలేదు. బెంగళూరులో ఓ డ్రగ్స్ కేసులో అతడి పేరు వినిపించింది. అప్పట్లో భారత రాష్ట్ర సమితి పెద్ద తలకాయలు ఈ కేసు డీల్ చేశాయ్ కాబట్టి సరిపోయింది.. లేకుంటే పెంట పెంట అయిపోయేది. భారత రాష్ట్ర సమితి పరువు గంగలో కలిసిపోయేది. అయినప్పటికీ రోహిత్ రెడ్డి తన ప్రవర్తనను మార్చుకోలేదు. పైగా మితిమీరిన ధోరణి కారణంగా వివాదాస్పదమైన ఎమ్మెల్యేగా పేరు గడించాడు. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ బిల్స్ కేసు విషయంలో రోహిత్ రెడ్డి పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ కేసులో మొదట్లో దూకుడుగా వ్యవహరించిన భారత రాష్ట్ర సమితి.. తర్వాత సిబిఐ ఎంటర్ కావడంతో సైలెంట్ అయిపోయింది. ఇదే సమయంలో రోహిత్ రెడ్డి ప్రవర్తన పై చాలా అనుమానాలు వచ్చాయి. ఈయన పలుమార్లు వాటిని నివృత్తి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఆయనకే ఎదురు తన్నింది. రోహిత్ రెడ్డి విపరీతమైన ధోరణి కారణంగా వచ్చే ఎన్నికల్లో కొత్త ముఖానికి చోటు ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే తాజాగా రోహిత్ రెడ్డి తన ప్రాణానికి ముప్పు ఉందని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో.. భద్రతను ప్రభుత్వం పెంచింది. ఇది ఇక్కడ దాకా ఉంటే బాగానే ఉండేది. కానీ అక్కడ ఉన్నది రోహిత్ రెడ్డి కాబట్టి మరోసారి ప్రధాన వార్తాంశమైంది.
ఇదేం బుద్ధి?
ఎవరైనా తన సెక్యూరిటీతో ఫోటోలు దిగుతారు. వారితో సంభాషణలు జరిపినప్పటికీ వాటిని అత్యంత రహస్యంగా ఉంచుతారు. ఇదేం బుద్దో గానీ రోహిత్ రెడ్డి సెక్యూరిటీతో ఏకంగా రీల్స్ చేశాడు. ప్రస్తుతం రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్ లో మహా రుద్రయాగం నిర్వహిస్తున్నాడు. ఆ రుద్ర యాగంలో వివిధ ప్రాంతాలకు చెందిన రుత్విక్కులు యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పవిత్రమైన చోట ఎంతో నిష్టగా ఉండాల్సిన రోహిత్ రెడ్డి… తనకు అలవాటైన ధోరణిలో ప్రవర్తించడం మొదలు పెట్టాడు. కాషాయం రంగులో ఉన్న ధోవతి ధరించి తన సెక్యూరిటీతో రీల్స్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రాణ భయం ఉన్న ఎమ్మెల్యేకు సెక్యూరిటీ పెంచితే.. సోషల్ మీడియాలో రీల్స్ చేసి వదులుతున్నాడని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అసలు ఫామ్ హౌస్ కేసు విచారణ సాగుతున్నప్పుడు భద్రత కల్పించిన ప్రభుత్వం.. ఇప్పుడు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి రోహిత్ రెడ్డి వ్యవహారం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది.