
ఏపీ సీఎం జగన్ వదలడం లేదు. ప్రతిపక్ష తండ్రికొడుకులను సమయం వస్తే చాలు ఇరికించేస్తున్నారు.టైం చూసి దెబ్బకొడుతున్నారు.తన పాలనలో ఎలాగైనా సరే చంద్రబాబు, లోకేష్ లపై వీలైనన్నీ కేసులు నమోదు చేయాలని జగన్ పట్టుదలగా ఉన్నట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అమరావతి దళితుల భూముల కుంభకోణంలో చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ కేసులో చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి మరీ స్టే తెచ్చుకున్నారు. దాన్ని సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ సవాల్ చేసింది.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇటీవల కాలంలో చంద్రబాబుపై అట్రాసిటీ కేసులు పెట్టడం ఇది రెండోసారి.
టీడీపీ ఫేస్ బుక్ పేజీలో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తూ పోస్ట్ పెట్టారని కేసు పెట్టాలని ఫిర్యాదు చేశారు. దానిపై డీజీపీ ఆదేశాల మేరకు విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
తాజాగా జగన్ పాదయాత్ర సందర్భంగా ఆయన కాళ్లకు దెబ్బలు తగిలితే పట్టుకొని చికిత్స చేస్తున్న గురుమూర్తి ఫొటోను టీడీపీ సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేసింది. ‘జగన్ పాద సేవ చేస్తున్న వ్యక్తిని ఎంపీని చేస్తే ప్రజలకు ఏం మేలు చేస్తారని’ కామెంట్ చేసింది.
ఇది వైరల్ కావడంతో వైసీపీ నేతలు వెంటనే ఈ పోస్టింగ్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు, లోకేష్ పై అట్రాసిటీ కేసు పెట్టారు. గురుమూర్తి దళితుడు కావడంతో.. ఆయనను కించపరుస్తూ టీడీపీ ప్రచారం చేసిందని ఆ పార్టీ అధినేతలపై ఈ కేసులు పెట్టారు.