
అదేంటో కేంద్రంలో అధికారంలో ఉన్నదీ వాళ్ల పార్టీనే.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణమూ అదే పార్టీ. కానీ.. మళ్లీ వింతగా ఓ రాష్ట్రం ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పడం వింతగా లేదూ..! దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో పట్టుకోసం కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి పోటీచేస్తుండగా.. కేరళలో చిన్న చితకా పార్టీలను కలుపుకుని వెళ్లాలని భావిస్తోంది.
Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ను బీజేపీ ప్రోత్సహిస్తోందా? కారణం ఇదేనా?
ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సభ్యుడు మాత్రమే ఉండగా.. ఈసారి ఆ సంఖ్యను పెంచుకునేందుకు తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగా మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ను తమ పార్టీలో చేర్చుకుంది. మరి ఇది ఏమేరకు బీజేపీకి సహకరిస్తుందో మే 2న తేలిపోనుంది. మరోవైపు, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుండగా.. ప్రతిపక్షాలు దీనిని ప్రచారాస్త్రంగా చేసుకుని బీజేపీని ఇరుకునబెట్టేందుకు సిద్ధమయ్యాయి.
Also Read: అమరావతికి హ్యాండిచ్చిన కేంద్రం
ఈ నేపథ్యంలో కేరళలో తాము అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్ రూ.60కే అందుబాటులోకి తీసుకొస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. అంతేకాదు.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని ఆ పార్టీ సీనియర్ నేత కుమ్మనం రాజశేఖరన్ తెలిపారు. కోచిలో ఆయన బుధవారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పెట్రో, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి లెఫ్ట్ సర్కార్ ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
పెట్రో ధరల పెంపు అనేది జాతీయ పరిధిలోని అంశమని, పెట్రో పెంపు ఎందుకు అనివార్యమైందో కేంద్రం వివరిస్తుందని రాజశేఖరన్ తెలిపారు. ఏ సమయంలోనైనా ఇంధనంపై జీఎస్టీ విధించలేమన్న కేరళ మంత్రి థామస్ ఐజాక్ వ్యాఖ్యలను రాజశేఖరన్ ప్రస్తావించారు. ‘ప్రపంచ మార్కెట్‌లో ధరలు హెచ్చుతగ్గులు వివిధ కారణాల వల్ల ప్రభావితమవుతాయి. అయితే దీనిని జీఎస్టీలో చేర్చడానికి ఆటంకం ఏంటి’ అని ప్రశ్నించారు. ఇప్పుడు రాజశేఖరన్ వ్యాఖ్యలతో అందరూ హవ్వా అంటూ వెక్కిరిస్తున్నారు తప్పితే ఎక్కడా ఆయన మాటలను లెక్కల్లోకి తీసుకోవడం లేదు.