తెల్లారి లేచామంటే బైక్‌లు లేకుంటే కార్లు లేనిదే ఏ పని జరగదు. మరి ఆ బైక్‌లు నడవాలంటే అందులో పెట్రోల్ పోయాల్సిందే. మరోవైపు.. పెట్రోల్ ధరలు చూస్తుంటే మండిపోతున్నాయి. దేశంలో పెట్రోల్ ధరలు ఆల్‌టైం గరిష్ఠానికి చేరుతున్నాయి. వ్యాట్‌లు, పన్నుల బాదుడు ఉండటంతో.. పెట్రోల్ రేట్లు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దేశంలో పెట్రో ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది.
ఏపీ సర్కారు వ్యాట్‌తోపాటు రోడ్ డెవలప్‌మెంట్ సెస్ వసూలు చేస్తుండటంతో పొరుగు రాష్ట్రాల కంటే ఇక్కడ పెట్రోభారం అధికంగా ఉంది. మంగళవారం నాటికి ఆంధ్రాలో పెట్రోల్ ధర రూ.92.18 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.85.11 పైసలు ఉంది. ఆరు నెలల్లో పెట్రోల్ ధర 6 శాతం పెరగ్గా.. డీజిల్ ధర 3.5 శాతం పెరగడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం పన్నులేమీ పెంచకపోయినా.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. మూల ధరపై పన్నుల భారం ఎక్కువగా ఉండటంతో చమురు ధరలు రాష్ట్రంలో ఎక్కువగా పెరిగాయి.
ఏపీ సర్కారు పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్ విధిస్తోంది. పెట్రో ఉత్పత్తుల మూల ధర పెరిగే కొద్దీ.. ఈ వ్యాట్ కూడా పెరుగుతుంటుంది. జగన్ సర్కారు వ్యాట్‌తోపాటు పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.4 చొప్పున అదనపు వ్యాట్‌ను వసూలు చేస్తోంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి రోడ్ డెవలప్‌మెంట్ సెస్ కూడా విధించింది.
ట్యాక్సులు, సెస్సుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.33.50 పైసలు, లీటర్ డీజిల్‌పై రూ.24 వసూలు చేస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇంధన ధరలు రూ.3 నుంచి రూ.5 వరకు అధికంగా ఉన్నాయి. ఏపీలో కంటే ఇక్కడే పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయని.. రాష్ట్ర సరిహద్దుల్లోని పెట్రోల్ బంకులు పెద్ద పెద్ద బ్యానర్లను ఏర్పాటు చేసి భారీ వాహనదారులను ఆఫర్లు ఇస్తున్నాయి.