Petrol Ban : తీవ్రకాలుష్యంతో పోరాడుతున్న ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి కొన్ని ప్రత్యేక వాహనాలకు పెట్రోల్, డీజిల్ సరఫరాను నిలిపివేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. క్రమంగా ఈ నిర్ణయం మొత్తం ఢిల్లీ-NCR ప్రాంతానికి వర్తించనుంది. జూలై 1 నుంచి ఢిల్లీలో 15 ఏళ్ల పాత పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్ల పాత డీజిల్ వాహనాలకు ఇంధనం సరఫరా చేయరు.
ప్రతేడాది శీతాకాలంలో ఢిల్లీ వాతావరణం అత్యంత దయనీయ స్థితికి చేరుకుంటుంది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లను దాటుతుంది. దీనికి ప్రధాన కారణాలు చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం, వాహనాల కాలుష్యం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన వివరాల ప్రకారం.. దేశంలోని వాయు కాలుష్యానికి 40 శాతం వాహనాల నుంచి వెలువడే పొగ కారణం. అందుకే ఈ నిర్ణయాన్ని శీతాకాలం రాకముందే తీసుకున్నారు.
ఢిల్లీలో పాత పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇంధనం నిలిపివేసే నిర్ణయం జూలై 1 నుంచి అధికారికంగా అమలులోకి రానుండగా, ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా), గురుగ్రామ్, సోనిపత్లలో కూడా ఇలాంటి నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఈ నగరాల్లో నవంబర్ 1 నుంచి పాత పెట్రోల్-డీజిల్ వాహనాలకు ఇంధనం ఇవ్వరు.
దీంతో పాటు NCR పరిధిలోకి వచ్చే మీరట్, ఫరీదాబాద్, రోహ్‌తక్, భివానీ, రేవారి, అల్వార్ వంటి నగరాల్లో కూడా ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఇక్కడ 10 ఏళ్ల నాటి డీజిల్ వాహనాలు, 15 ఏళ్ల నాటి పెట్రోల్ వాహనాలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 తర్వాత పెట్రోల్, డీజిల్ పోయరు.
ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఢిల్లీలో దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీలోని పెట్రోల్ బంకుల్లో పాత వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు, సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ కార్లకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వడానికి నిరాకరించనున్నారు. ఢిల్లీలో ఇప్పటివరకు 372 పెట్రోల్ బంకులు, 105 CNG ఫిల్లింగ్ స్టేషన్‌లలో ఇలాంటి కెమెరాలు, సిస్టమ్‌లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మిగిలిన పెట్రోల్ బంకుల్లో ఈ పని ఏప్రిల్ చివరి నాటికి పూర్తవుతుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మరో కేబినెట్ మంత్రి మజిందర్ సింగ్ సిర్సా స్వయంగా దీనిని పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో కాలుష్య స్థాయిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక విభిన్న పథకాలపై పనిచేస్తోంది. దీని కోసం ఢిల్లీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నారు. త్వరలో EV పాలసీ 2.0 కూడా రాబోతుంది.
Also Read : త్వరలో పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం.. కారణం ఎంటో తెలుసా ?