మీకు ఎలాంటి పాలన కావాలి? నియంతృత్వమా? ప్రజాస్వామ్యమా?? అంటే.. కనీస అవగాహన ఉన్న ఎవరైనా రెండోదానికే చెయ్యెత్తుతారు. కారణం.. నియంతృత్వంలో ప్రజలకు ఎలాంటి హక్కులూ ఉండవు.. పాలకుల శాసనాలు మాత్రమే చలామణిలో ఉంటాయి. తలెత్తి ప్రశ్నించడానికి ఎవరికీ అవకాశం ఉండదు.. తలొంచుకు పాటించడం మాత్రమే ఉంటుంది. రాజ్యంలో ప్రజాగొంతుక మూగబోగా, పాలకుల ఆదేశాలు నలుదిక్కులా ప్రతిధ్వనిస్తుంటాయి. తుదకు, జనం తమ స్వతంత్రతను కోల్పోయి బానిసలుగా మిగిలితారు. అందుకే.. ప్రజలు ప్రజాస్వామ్యానికి ఓటేస్తారు. తమ కోసం తామే నిర్మించుకున్న ప్రజారాజ్యంలో.. పాలకులుగా ఎవరుండాలో కూడా ఓటేసి, తామే ఎన్నుకుంటారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని జనరంజక పాలన సాగించిన వారిని నెత్తిన పెట్టుకుంటారు.. కళ్లు నెత్తికి ఎక్కినవారిని ఎత్తి కుదేస్తారు.
Also Read: తెలంగాణలో నడిపించే నాయకుడెవరు..?
తెలంగాణ.. ఇది పోరాటాల పురిటి గడ్డ. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా.. సాయుధపోరు సాగించి నైజాం, రజాకార్లను తరిమి కొట్టిన చరిత ఈ నేల సొంతం. సమైక్య పాలనలో అన్ని విధాలుగా నష్టపోయామని, నాలుగున్నర కోట్ల ప్రజలు ఏకమై, స్వరాష్ట్రం సిద్ధింపచేసుకున్న ఘనత ఇక్కడి ప్రజల సొంతం. ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలు ముడుపుకట్టుకొని, వందల ప్రాణాలు బలిపెట్టుకొని, సాధించుకున్న రాష్ట్రాన్ని.. ఉద్యమ పార్టీగా ప్రకటించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి చేతిలోనే పెట్టారిక్కడి ప్రజలు. తెలంగాణ కోసమే పుట్టానని, తాను మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలెక్కించగలనని టీఆర్ఎస్ చెప్పిన మాటను తెలంగాణ ప్రజలు నమ్మి, వరుసగా రెండు సార్లు అధికారం అప్పజెప్పారు. మరి, ప్రజాకాంక్షను నెరవేర్చడంలో గులాబీ దళం ఎంత మేర సఫలీకృతమైందన్నదే సమాధానం వెతకాల్సిన ప్రశ్న.
నాణేనికి రెండువైపులా బొమ్మా బొరుసు ఉన్నట్టే.. మాట్లాడే ప్రతీ మాటకు రెండు కోణాలు ఉంటాయి. అది ప్రభుత్వ నిర్ణయం అయినప్పుడు, దాని తీవ్రత మరింతగా ఉంటుంది. కోటాది మంది ప్రజలపై ప్రభావం చూపుతుంది కాబట్టి, ప్రభుత్వ శాసనాలు, ఆదేశాలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని తప్పక వ్యక్తం చేస్తారు. వినకపోతే నిరసన తెలుపుతారు. వారి అభ్యంతరాలను సావధానంగా ఆలకించి, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సర్కారుదే. ఈ విధంగా.. ప్రజలూ, పాలకులు జోడెద్దుల బండిలా కలిసి ముందుకు సాగుతుంటేనే అభివృద్ధి రథం ప్రగతివైపు పరుగులు తీస్తుంది. కానీ.. ప్రభుత్వం ప్రజభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే..? నిరసన తెలిపే హక్కునే కాలరాస్తే..? అది ఖచ్చితంగా.. ప్రజాస్వామ్యపు మేలి ముసుగు వేసుకున్న నియంతృత్వమే అవుతుంది. టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఖరి ఇదే విధంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. తమను ప్రశ్నించడానికి ప్రతిపక్షమే ఉండొద్దని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన గులాబీ సర్కారు.. చివరకు నిరసన తెలిపే ప్రజల ప్రాథమిక హక్కును కూడా హరించిందన్నది ప్రధాన అభియోగం. రాజధానిలో ధర్నాచౌక్ లేకుండా చేయడమే ఇందుకు దర్పణం అన్న విపక్షాలు, ప్రజాసంఘాల విమర్శ కాదనలేనిది. ఇక, ప్రజల సంస్కృతిలో పండగలు ప్రధానమైనవి. అవి వారి జీవన విధానానికి ప్రతిబింబాలు. అలాంటి పండగలపైనా గులాబీ పార్టీ గుత్తాధిపత్యం సాధించే ప్రయత్నం చేసింది, చేస్తోంది అన్నది మరో ఆరోపణ. బతుకమ్మ ఉత్సవాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం కూడా ఇందులో భాగమే అన్నది విమర్శకుల వాదన. సెలవుల ప్రకటన కూడా ముఖ్యమంత్రి ఇష్టారీతిన ఉంటోంది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో దసరా సెలవులను పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయంపై మెజారిటీ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా.. భారత్ బంద్ కు మద్దతు. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం బంద్ లో పాల్గొనాల్సిందే అన్నట్టుగా కేసీఆర్ పిలుపు ఇవ్వగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బంద్ లో పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రకటించడాన్ని ఇక్కడ ఎవరూ తప్పు బట్టరు. కానీ.. రాష్ట్రంలో మీరు అణగదొక్కిన నిరసనల సంగతి ఏంటన్న ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తుంది. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడాన్ని ఎలా సమర్థించుకుంటారని ఇదే ప్రజలు నిలదీస్తారు. వీటికి సర్కారు వద్ద సమాధానం ఉందా? మొన్న దుబ్బాక, నిన్న జీహెచ్ ఎంసీ లో గులాబీ వ్యతిరేక పవనాలు వీచాయి. రేపు నాగార్జునసాగర్, ఎల్లుండి వరంగల్, ఖమ్మం ఎన్నికలు జరగనున్నాయి. విపక్షమే లేకుండా చేసి టీఆరెస్ ఏలుతున్న రాష్ట్రంలో.. బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక అంశాలను జనాల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకే భారత్ బంద్ కు టీఆర్ ఎస్ మద్దతు తెలిపిందనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం.
Also Read: ‘గ్రేటర్’పై అంతుచిక్కని కేసీఆర్ వ్యూహం.. స్పెషల్ పాలనకే మొగ్గు..!
“మేము చెప్పిందే ప్రజలు చేయాలి” అనే వైఖరి ప్రజాస్వామ్యంలో మనజాలదు. అది, రాష్ట్రాన్ని, దేశాన్ని నియంతృత్వం వైపు మళ్లిస్తుంది. ఈ వైఖరిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాభీష్టాన్ని పక్కనపెట్టి పాలన సాగిస్తోందని, తమ రాజకీయ అవసరాల మేరకే కేసీఆర్ నిర్ణయాలు ఉంటున్నాయి అనే వాదనను సమర్థించే వాళ్ల సంఖ్య అంతకంతకూ రెట్టింపు అవుతోంది. ప్రజాస్వామ్యంలో ఈ పరిస్థితి అవాంఛనీయం. వాస్తవానికి, ఈ విధానల వల్లనే దుబ్బాకలో, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు విజయం దక్కలేదన్నది విశ్లేషకుల మాట. అధికారం అప్పగించిన కాలంలో ప్రజోపయోగమైన పనులు ఏం చేశారు..? తద్వారా.. ప్రజాభిమానాన్ని ఎంత మేర ప్రోదీ చేసుకున్నారు అన్నదే పాలనకు గీటు రాయి. అదే.. మరోసారి అధికార పీఠాన్ని అప్పగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జనం మెప్పు పొందాలంటే ప్రజారంజక పాలన సాగించాలి. వారి సంక్షేమాన్ని సంరక్షించాలి. వారి జీవన విధానాన్ని మెరుగు పరిచే నిర్ణయాలతో అభివృద్ధికి బాటలు పరచాలి. ఇది విస్మరించిన రోజున.. ఏ పార్టీనైనా, ప్రభుత్వాన్నైనా ప్రజలు విస్మరిస్తారు. విసర్జిస్తారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Peoples politics is the amulet for governments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com