CM Jagan Visit Srikakulam: సీఎం జగన్ పర్యటనతో శ్రీకాకుళం జిల్లా ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. అధికారులు, పోలీసుల ఆంక్షలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.సమగ్ర భూ సర్వే పథకాన్ని శ్రీకారం చుట్టేందుకు సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వచ్చారు. అయితే రెండు రోజులు ముందుగానే నరసన్నపేట పట్టణాన్ని పోలీసులు, అధికారులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పట్టణంలో దాదాపు రెండు కిలోమీటర్ల ప్రధాన రహదారి మధ్యలో బారికేడ్లు ఏర్పాటుచేశారు. రోడ్డుకిరువైపులా ప్రజలు చొచ్చుకొని రాకుండా ఉండేందుకు పరదాలు కప్పారు. అదే మార్గంలో కాలేజీలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు ఉన్నాయి. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. అటు వేదికను ఏర్పాటుచేసి కాలేజీ మార్గంలో దుకాణాలకు ముందు నిర్మాణాలు, సన్ సైడ్ లను తొలగించారు. బుధవారం ఉదయం నుంచి సీఎం వెళ్లే వరకూ షాపులు తెరవకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అటు అత్యవసర, అనారోగ్య సమయాల్లో ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళుతున్నారు.

నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు పక్కనే ఉన్న టెక్కలి, శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుంచి జనాలను సమీకరించేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. అటు ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటించి మరీ వాటి వాహనాలను తరలించుకుపోయారు. ప్రధానంగా శ్రీకాకుళం, టెక్కలి ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు సీఎం టూర్ కు వేయడంతో ప్రజారవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. నరసన్నపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రతీ ఇంటికి ఆహ్వానాలు పంపారు. తప్పకుండా సమావేశానికి హాజరుకావాలని ఒత్తిడి తెచ్చారు. లేకుంటే సంక్షేమ పథకాల్లో కోత తప్పదని భయపెట్టారు. మంగళవారం సాయంత్రానికి శ్రీకాకుళంతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి దాదాపు రెండు వేల మంది పోలీసులు నరసన్నపేటను మోహరించారు. చలిలో అవస్థలు పడ్డారు.

శ్రీకాకుళం జిల్లాలోని అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కాలేజీల్లో మంగళవారం నుంచి విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే డిగ్రీ కాలేజీకి అడ్డంగా పరదాలు కప్పడంతో విద్యార్థులు పడిన బాధలు వర్ణనాతీతం. అటు బుధవారం పరీక్ష కేంద్రాన్ని అప్పటికప్పుడు వేరే దగ్గరకు తరలించారు. దీంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. అటు ట్రాఫిక్ సైతం మళ్లించడంతో వాహనదారులు, ప్రయాణికులు, అత్యవసరంగా బయటకు వచ్చిన వారు అసౌకర్యానికి గురయ్యారు. అటు జిల్లా వ్యాప్తంగా నాలుగు డిపోల నుంచి బస్సులు సీఎం టూర్ కు వెళ్లడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. పది రోజుల కిందట ప్రధాని విశాఖ పర్యటనలో ఇదే విధంగా వైసీపీ నేతలు ప్రజలకు ఇబ్బందిపెట్టారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదురుకావడంతో అసహనానికి గురవుతున్నారు. సీఎం పర్యటన అంటేనే వామ్మో అంటూ భయపడుతున్నారు.