Hit 2 Trailer: మొదటి చిత్రం ‘హిట్’ తో ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు శైలేష్ కొలను. విశ్వక్ సేన్ హీరోగా విడుదలైన హిట్ ప్రేక్షకులకు పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ పరిచయం చేసింది. ఒక మిస్సింగ్ అమ్మాయి కేసు చుట్టూ హిట్ చిత్రం సాగుతుంది. సక్సెస్ ఫుల్ హిట్ చిత్రానికి కొనసాగింపుగా ‘హిట్ 2’ తెరకెక్కింది. సెకండ్ కేసు పేరుతో దర్శకుడు శైలేష్ కొలను మరొక క్రైమ్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. హిట్ 2 ట్రైలర్ నేడు విడుదల చేయగా, ప్రతి క్షణం ఉత్కంఠ రేపుతూ గూస్ బంప్స్ తెప్పించింది.

ఒక సైకో సీరియల్ కిల్లర్ కథే హిట్ 2 అని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. దారుణంగా హత్య చేయబడిన సంజన అనే అమ్మాయితో మొదలైన పోలీసుల విచారణ కీలక మలుపులు తీసుకుంటుంది. ఊహించని పరిణామాలు పరిచయం చేస్తుంది. చనిపోయింది ఒక్క సంజన మాత్రమే కాదు,అక్కడ ఉంది కొంత మంది అమ్మాయిల శరీర భాగాలతో కూడిన శవమని తెలిసి విస్తుపోతారు. మోస్ట్ ఇంటిజెంట్, సైకో కిల్లర్ ని వెతుకుతున్నామని తెలుసుకున్న పోలీసుల మైండ్ బ్లాక్ అవుతుంది.
రెండున్నర నిమిషాల ట్రైలర్ ప్రతి క్షణం ఉత్కంఠగా సాగింది. గూస్ బంప్స్ కలిగించింది. దర్శకుడు శైలేష్ కొలను మరో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తో వస్తున్నట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక సైకో కిల్లర్ ని వేటాడే పోలీస్ అధికారిగా అడివి శేష్ నటించారు. ఇన్వెస్టిగేటివ్ అధికారిగా అడివి శేష్ లుక్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ కి ఆయన బెస్ట్ ఛాయిస్ అని మరోసారి నిరూపించుకున్నారు.

గతంలో అడివి శేష్ నటించిన క్షణం, ఎవరు చిత్రాలు ప్రేక్షకులకు అద్భుత అనుభవాన్ని ఇచ్చాయి. హిట్ 2 తో ఆయన రికార్డు రిపీట్ చేయడం ఖాయమనిస్తుంది. మొత్తంగా హిట్ 2 ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. మీనాక్షి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తనికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని, కోమలి ప్రసాద్ కీలక రోల్స్ చేశారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని నిర్మించారు. ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ హిట్ 2 విడుదల కానుంది.