Odisha Train Accident: గొంతుకు నీళ్ళు.. ఒంటికి నెత్తురు.. బాహనగ బజార్, బాల సోర్ కు ఏమిస్తే రుణం తీరుతుంది?

బాహనగ బజార్.. ఒక చిన్న గ్రామం. బాలసోర్ పట్టణానికి దగ్గరగా ఉంటుంది. బాహనగ బజార్ గ్రామం మీదుగానే రెండు వరుసల్లో రైల్వే ట్రాక్ వెళ్తుంది. మహా అయితే ఈ స్టేషన్లో ప్యాసింజర్ రైలు ఆగుతుంది.

Written By: K.R, Updated On : June 6, 2023 11:20 am

Odisha Train Accident

Follow us on

Odisha Train Accident: “పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని? మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని? పద పదమని పలుకులే గాని.. కదలని అడుగులు దేనికని?” అప్పట్లో ప్రఖ్యాత కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి నారాయణ రెడ్డి ఒక గజల్ లో రాసిన వాక్యాలివి. ఈ వాక్యాల్లో లాగానే బాహనగ బజార్, బాల సోర్ ఎంతోమందికి ప్రాణాలు ఇచ్చాయి. గొంతు ఎండిపోయిన వారికి నిరందించాయి. రైలు బోగీల కింద చిక్కుకొని గాయపడ్డ వారికి రక్తం అందించాయి. కొత్త రక్తసంబంధాన్ని కలిపాయి. చిమ్మ చీకటిలో ఎన్ డి ఆర్ ఎఫ్ రాకముందే తన వంతు సహాయం చేశాయి. మానవతకు మించింది మరేది లేదని మరోసారి చాటి చెప్పాయి.

చేతులెత్తి మొక్కలు

బాహనగ బజార్.. ఒక చిన్న గ్రామం. బాలసోర్ పట్టణానికి దగ్గరగా ఉంటుంది. బాహనగ బజార్ గ్రామం మీదుగానే రెండు వరుసల్లో రైల్వే ట్రాక్ వెళ్తుంది. మహా అయితే ఈ స్టేషన్లో ప్యాసింజర్ రైలు ఆగుతుంది. కోవిడ్ సమయంలో అది కూడా లేదు. ఇప్పుడు కూడా ప్యాసింజర్ రైలు ఆది వారం రావడం లేదు. ఒడిశాలో గ్రామం అయినప్పటికీ పశ్చిమ బెంగాల్ కు సరిహద్దున ఈ ఊరు ఉంటుంది. ఇక ఆరోజు అంటే శుక్రవారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ప్ ఆ గ్రామం రైల్వే స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురైంది. సినిమాలో చూపించినట్టు రైలు బోగీల్లో కొన్ని పట్టాలు తప్పాయి. చెల్లా చెదురుగా పడ్డాయి. అక్కడ దృశ్యం చాలా భీతావాహంగా ఉంది. ఆ శబ్దం విన్న బాహనగ బజార్ వాసులు పరుగున అక్కడికి వచ్చారు. వీరికి బాలాసోర్ ప్రజలు కూడా తోడయ్యారు. సెల్ ఫోన్ ల టార్చ్ లైట్ ల సహాయంతో బోగిలోకి వెళ్లారు. గాయపడ్డ వారిని నిచ్చెనలు, తాళ్ల సహాయంతో బయటకు తీశారు. గ్రామ సర్పంచ్ అప్పటికప్పుడు నీళ్లు తెప్పించాడు. దాహం అన్న వారి గొంతు తడిపాడు. ఊరు కాని ఊరు.. భాష తెలియదు.. అసలు వారి మధ్య ఎటువంటి సంబంధం కూడా లేదు. అయినప్పటికీ ఆ చిన్న గ్రామానికి చెందిన ప్రజలు, బాలాసోర్ పట్టణవాసులు జాతీయ విపత్తు దళం రాకముందే తమవంతు సహాయం చేశారు. గాయపడ్డ వారిని బయటికి తీసుకొచ్చారు. కన్ను మూసిన వారిని కూడా వెలికి తీశారు. ఇంత పెద్ద వ్యవస్థలు ఉన్నప్పటికీ తమ వంతుగా కొన్ని వందల ప్రాణాలు కాపాడారు. అన్నింటికీ మించి ఇన్సెంటివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్న బాధితుల కోసం రక్తం ఇచ్చేందుకు రాత్రంతా మేల్కొని ఉన్నారు. బాధితులు చెప్పిన ఫోన్ నెంబర్ల ఆధారంగా వారి బంధువులకు సమాచారం అందించారు. ఒక మాటలో చెప్పాలంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ బాధితుల కోసం బాహనగ బజార్ ఊరు ఊరంతా కదిలి వచ్చిందంటే మామూలు విషయం కాదు. బాలాసోర్ పట్టణవాసులు ప్రాణాలకు తెగించారంటే అతిశయోక్తి కాదు.

అందుబాటులో ఉన్న వస్తువులతో..

కళ్ళ ముందు ఘోరం జరిగింది. రైలు బోగీ ల కింద పడ్డవారు ఆర్తనాదాలు చేస్తున్నారు. వారిని చూసిన బాహనగ బజార్, బాలాసోర్ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ కన్నీటిని తుడుచుకుంటూనే తమ వంతుగా సహాయం చేశారు. ఎవరో వస్తారు అని ఎదురు చూడక ముందే రంగంలోకి దిగారు. తాళ్ల సహాయంతో బోగిల కింద చిక్కుకున్న వారిని బయటికి తీశారు. నిచ్చెనలు వేసుకొని బోగిల పైన ఉన్న వారిని కిందకు దించారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్ ఆధారంగా చిమ్మ చీకటిలోనూ సహాయక చర్యలు చేపట్టారు. తమ బైకుల మీద క్షతగాత్రులను ఎక్కించుకొని బాలాసోర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తమ రక్తం ఇచ్చారు. ఇలా కొత్త కొత్త రక్త సంబంధాలను కలుపుకున్నారు. 300 మందిని రాత్రంతా వారి పొత్తిళ్లలో పెట్టుకొని కాపాడుకున్నారు.. ఏమిచ్చి ప్రజల రుణం తీర్చుకోవాలి? ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి? ఎలాంటి ఉపమానంతో వారి సేవా నిరతిని పొగడాలి? జస్ట్ ఆ గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేయడం తప్ప.. బాహనగ బజార్, బాలాసోర్ ప్రజలు కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే చేయలేదు. పోతున్న మానవతను, పడిపోతున్న మానవత్వాన్ని మహోజ్వలంగా వెలిగించారు.