YSRCP Gadapa Gadapaku: ఏపీలో వైసీపీ ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి నిలదీతలు, ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమానికి గ్రామాలకు విచ్చేస్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు కడిగి పారేస్తున్నారు. ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. గుంతలు పడిన రోడ్లు సంగతేంటి, పెరిగిన కరెంట్ బిల్లులు ఏమిటి? సంక్షోమ పథకాలు, మద్యం, సారా అమ్మకాలు.. ఇలా ఒకటేమిటి అన్ని వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లుగా ఏం చేశారు.. రోడ్లు నడవటానికి వీల్లేకుండా ఉన్నాయి.. అని విజయవాడలో ఎమ్మెల్యే వెలంపల్లిపై ప్రజలు ఆగ్రహించారు. గత ప్రభుత్వంలోనూ ఇలాగే ఉన్నాయి.. అప్పుడేం చేశారని వెలంపల్లి ఎదురుదాడికి ప్రయత్నించారు. అయితే, అప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి.. మీ ప్రభుత్వమే పైపులైన్ల కోసం తవ్వి వదిలేసిందని అక్కడే వున్న ఓ మహిళ దీటుగా బదులిచ్చింది. విద్యార్థులకు గత ప్రభుత్వం విదేశీ విద్య అందించిందని, మూడేళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరో మహిళ నిలదీసింది. సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్నదెంత, తిరిగి తీసుకుంటున్నదెంతో లెక్క చెప్పాలని మరో మహిళ ప్రశ్నించారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు చుక్కెదురైంది. గ్రామంలో కాలువలు ఏవి… రోడ్ల నిర్మాణం ఎక్కడ.. ఫించన్లు ఎప్పుడు ఇస్తారంటూ పూపపాటిరేగ మండలం కనిమెళ్ల గ్రామస్థులు ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల గురించి ఎమ్మెల్యే తెలియజేస్తుండగా కరగాన బుచ్చోడు అనే వ్యక్తి… కొందరు రజక మహిళలు ఆయనపై విరుచుకుపడ్డారు. కాలువలు లేక తాము ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. ఇళ్లు మంజూరుకాలేదు.. వచ్చిన ఫింఛను కూడా నిలిపివేశారంటూ ఇదే జిల్లా లక్కవరపుకోట మండలం కొట్యాడ గ్రామానికి చెందిన కొందరు మహిళలు.. ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును నిలదీశారు. గతంలో పింఛను వచ్చేదని, మూడు నెలల తరువాత ఆపేశారని ఎర్రా ఆదిలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు. రెండుమార్లు ఇల్లు మంజూరైనా దాన్ని రద్దుచేశారని, అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నామని ఎర్రా సన్యాసమ్మ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
‘మీ కార్యకర్తలకైతే తక్కువ వయసు ఉన్నా పింఛన్లు ఇస్తారా’ అని ఓ గ్రామస్థుడు… కురుపాం నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిని నిలదీశారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం ఎం.అల్లువాడలో పుష్పశ్రీవాణి పర్యటించారు. ప్రభుత్వ పథకాలను ఆమె వివరిస్తుండగా లోలుగు త్రినాథరావు అనే వ్యక్తి తనకు అర్హత ఉన్నప్పటికీ చేయూత పథకం వర్తింపజేయలేదన్నారు. అధికారులను అడిగినప్పటికీ ఎవరూ స్పందించడం లేదన్నారు. ‘‘అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు అందటం లేదు. ఇదేనా మీ ప్రభుత్వం తీరు?’’ అని నిలదీశారు. ఆయనకు సమాధానం చెప్పకుండానే పుష్పశ్రీ అక్కడి ఉంచి వెళ్లిపోయారు.
‘మేం అర్హులం..అయినా మాకు పథకాలు ఎందుకు వర్తింపజేయరు’ అంటూ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను జనం నిలదీశారు. జి.సిగడాం మండలం ఆనందపురం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కిరణ్ కు పోగిరి పాపారావు అనే వ్యక్తి నిలదీశాడు. ఇల్లు, రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాల కోసం అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదని మండిపడ్డారు. ‘ఏం ఇస్తున్నారని ప్రజల్లోకి వస్తున్నా’రని ఎమ్మెల్యే ఎదుటే ఆగ్రహించారు.
మూడు దశాబ్దాలుగా మీ కుటుంబాన్ని ఆదరిస్తున్నాం. మీరు మా గ్రామానికి చేసిందేమిటి చెప్పండంటూ అని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి మేకపాటి విక్రమ్‌రెడ్డిని పోలిరెడ్డిపల్లి గ్రామస్థులు నిలదీశారు. గ్రామంలో పర్యటించిన తండ్రీ కొడుకులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విక్రమ్ రెడ్డి హఠాత్ పరిణామంతో కంగుతిన్నారు. నడవడానికి సరైన రోడ్లు లేవని, వర్షం పడినప్పుడు అవి బురదతో రొచ్చురొచ్చుగా మారి దోమలతో ఇబ్బందులు పడుతున్నామని వారి ఎదుట ఆక్రోషించారు. మొత్తానికి వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బిక్క ముఖం వేసుకుంటున్నారు. కొందరైతే టీడీపీ, జనసేన నేతలు రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు.
Also Read:KCR- Damodara Rao: కేసీఆర్ కు ప్రేమా.. లేక భయమా? ఆయనకు పదవి ఎందుకిచ్చారు?
Recommended Videos