Pawan Kalyan Yuvashakti Sabha: వెనుకాబటుతనం అనేది ఉత్తరాంధ్రకున్న అపవాదు. కానీ ఇది పాలకుల పుణ్యమే.కానీ ఆ ప్రాంతం నిజంగా వెనుకబడి ఉందా? అంటే సమాధానం కరువవుతోంది. విస్తారమైన సహజ వనరుల, మౌలిక సౌకర్యాల లభ్యతలో ఉత్తరాంధ్ర ప్రపంచంలోనే అరుదైన ప్రాంతాలలో ఒకటి. నదులు, అడవులు, సముద్ర తీరం, ఖనిజ సంపద, రైలు, రహదారి మార్గాలు, ఓడరేవు, విమానాశ్రయం, అపారమైన మానవ శ్రమశక్తి పుష్కలంగా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రాంతాలను చూసినా ఈ వనరులన్నీ ఉన్న ఏకైక సంపన్న ప్రాంతం ఉత్తరాంధ్రనే. కానీ ఈ వనరుల్లో ఏ ఒక్కటీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఉత్తరాంధ్ర బిడ్డల మెరుగైన జీవనానికి సంపూర్ణంగా ఉపయోగపడడం లేదు. ఇక్కడి వనరులను ఉపయోగించి ఇక్కడి ప్రజల, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే రాజకీయ, ఆర్థిక, పాలనా విధానాలు ఒక్కటీ లేవు. దాని ఫలితమే వెనుకబాటు అన్న అపవాదు. కానీ వనరులను వినియోగించి ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నిలబెట్టే ప్రయత్నం జరిగిందా? అంటే అదీ లేదు.

ఉమ్మడి ఏపీలోనైనా.. అవశేష ఆంధ్రప్రదేశ్ లో చివరికి విసిరేసినట్టుట్టుంది ఉత్తరాంధ్ర ప్రాంతం.ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిధిలో విస్తరించి ఉంటుంది. పునర్వ్యవస్థీకరణంలో భాగంగా కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాలు ఏర్పడ్డాయి. ఉత్తరాంధ్ర ప్రస్తుతం ఆరు జిల్లాలుగా మనుగడలో ఉంది. ఉమ్మడి జిల్లాలను తీసుకుంటే ఏపీ విస్తీర్ణం, జనభా పరంగా.. 15 శాతం, 19 శాతంగా ఉన్నాయి. ఇక్కడ పుష్కలమైన జల, ఖనిజ, అటవీ వనరులతో, మానవ వనరులతో అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలవాల్సి ఉంది. కానీ, పాలకుల నిర్లక్ష్యం వల్ల న్యాయంగా రావలసిన వాటా దక్కని దుస్థితి. కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ప్రస్పుటంగా ప్రస్తావించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఎంతగా వెనుకబడి ఉన్నదో గణాంకాలతో సహా చూపింది. కానీ ప్రభుత్వాలు, పార్టీల్లో కనీస చలనం లేదు. పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యారంగంలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉంది. ప్రాథమిక ఆరోగ్యం, పర్యాటక రంగం, విద్యుత్ శక్తి, రవాణా, ప్రభుత్వరంగ పరిశ్రమలు, వలసలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, పారిశుధ్యం ఇలా ఏ రంగాన్ని తీసుకుని పరిశీలించినా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం స్పష్టంగా కనబడుతుంది.
-అపార సాగునీటి వనరులు ఉత్తరాంధ్ర సొంతం. కానీ పొలాలకు నీరు అందని దుస్థితి. బాహుదా, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి, పెద్ద గెడ్డ, కందివలస గెడ్డ, చంపావతి, జంఝావతి, సీలేరు, శబరి, గోస్తని, నరవ గెడ్డ, శారద, వరాహ, తాండవ వంటి జీవ నదులకు పుట్టినిల్లు అయినా.. ఒడిసిపట్టే ప్రయత్నం జరగకపోవడం ఇక్కడి ప్రజలకు శాపం. సాగునీటి సౌకర్యాలు కనీస స్థాయిలోనూ లేవు. ఉత్తరాంధ్రలో 58 లక్షల సాగుభూమికిగాను.. సాగునీరు అందుతున్నది కేవలం 24 లక్షల ఎకరాలకే. దీనికి బాధ్యులు ఎవరు? బాధ్యత తీసుకునేది ఎవరు? జీడి, మామిడి, కొబ్బరి, వరి..ఇలా అన్నిరకాల పంటలను పండించే సత్తా రైతుకు ఉన్నా.. ఉన్న వనరులను వినియోగంలోకి తెచ్చి అందించాల్సిన ప్రభుత్వాల ప్రేక్షక పాత్రను ఏమనాలి?
గిరిజనం ఎక్కువగా ఉండేది కూడా ఈ ప్రాంతమే. కానీ ప్రభుత్వాలు మారుతున్నా… పార్టీలు ఏలుబడిలోకి వస్తున్నా గిరిజనాభివృద్ధి పేపర్లకే పరిమితమవుతోంది. 2012లో అరకు డిక్లరేషన్- ఆదివాసీ ప్రాంతాలలో అమలు చేయవలసిన అభివృద్ధి పథకాల గురించి, విధానాల గురించి స్పష్టమైన సూచనలు చేసింది. వాటిని అమలుచేశారంటే అదీ లేదు. ఉత్తరాంధ్రకు ఉన్న 340 కిలోమీటర్ల సముద్రతీరాన్ని సముద్రం మీద ఆధారపడిన ప్రజల అభివృద్ధికి ఏ ప్రభుత్వాలు కనీస తోడ్పాటు ఇవ్వటం లేదు. సముద్ర తీరంపై మత్స్యకారులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడం లేదు. అటు ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగడం లేదు.2016-17 ఆర్థిక సర్వే ప్రకారం.. భారతదేశంలో పది కోట్ల మంది వలస కార్మికులున్నారు. వారిలో 22 లక్షల మంది ఉత్తరాంధ్ర వారే. బతుకు తెరువు కోసం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర వంటి చోట్లకు వెళ్తున్నారు. ఇన్నేళ్లలో ఎందుకు ఈ వలసల్ని ఆపలేదని ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, అక్కడ పాలకుల్ని ప్రశ్నించినా సమాధానం మాత్రం రాదు. ఉత్తరాంధ్ర నాయకులు.. ప్రభుత్వ పెద్దల వద్ద ఊడిగం చేయటం వల్లే ఈ దుస్థితికి కారణమని ప్రజలకు కూడా గుర్తించాలి.

పాలకుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల ఉదాసీనతతో ఈ ప్రాంతం దగాకు గురైంది. అందుకే ఉత్తరాంధ్ర ఆకాంక్షలను, ఆశలను తెలుసుకునేందుకే పవన్ యువశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కడున్న ప్రజల భావలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే మహత్తర కార్యక్రమాన్ని శ్రీకాకుళం వేదికగా నిర్వహిస్తున్నారు. అపారమైన సహజ వనరులూ ఉండీ ఎందుకు నానాటికీ వెనుకబాటుతనంలో మగ్గిపోతున్నదో…. తెలుసుకోవలసిన చారిత్రక సమయం ఇదేనని పవన్ భావిస్తున్నారు. ఈ ప్రాంతం పట్ల పాలకుల నిర్లక్ష్యం.., వనరుల విధ్వంసం.., అభివృద్ధి రాహిత్యం అనే ముప్పేట దాడిని అడ్డుకోవడం ఉత్తరాంధ్ర బిడ్డలుగా అందరిదీ అని పవన్ గుర్తుచేస్తున్నారు. బానిసత్వం విడనాడి వెనుకబాటుతనం అన్న అపవాదు నుంచి తమ ప్రాంతాన్ని బయటపడేందుకు స్థానిక యువతను సమిధులుగా మార్చే ప్రయత్నతమే యువశక్తి.