Homeఆంధ్రప్రదేశ్‌Pawan Alliance With People: జనంతో నే పవన్ పొత్తు.. బీజేపీకి దారేది?

Pawan Alliance With People: జనంతో నే పవన్ పొత్తు.. బీజేపీకి దారేది?

Pawan Alliance With People: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలన్న నిశ్చయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని కూడా ఆయన ప్రకటించారు. దీంతో పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. టీడీపీ, బీజేపీతో కలిసి నడవాలని కూడా సంకేతాలిచ్చారు. అయితే అప్పటివరకూ మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ జాతీయ పార్టీ కనుక రకరకాల అంశాలను భేరీజు వేసుకొని గుంభనం పాటిస్తోంది. టీడీపీ అయితే ఎక్కడ జనసేనకు అడ్వాంటేజ్ గా మారిపోతుందోనని వెనక్కి తగ్గింది. దీంతో ఆ రెండు పార్టీలతో పవన్ విసిగి వేశారిపోయారు. ఇక మనకు పార్టీలతో కాదు జనంతో పొత్తు అని పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారు. నేరుగా వైసీపీ ప్రభుత్వానితో ఫైట్ కు దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మాత్రం బీజేపీ డైలమాలో పడిపోయింది. విలువైన మిత్రుడ్ని కోల్పోయే స్థితిని తెచ్చుకుంది. పవన్ విషయంలో రాష్ట్ర పార్టీ నేతలు ఒకలా ఆలోచిస్తుంటే.. ఢిల్లీ పెద్దలు మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీని అత్మస్థైర్యంలోనెట్టేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో కౌలురైతు భరోసా యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాను చెప్పింది ఆలోచించమని మాత్రం కోరుతున్నాను అని పవన్ అన్నారు. ఇప్పటి వరకు వైసీపీ పరిపాలనను చూసిన ప్రజలు.. ఒక్కసారి జనసేన వైపు చూడాలని కోరుకుంటున్నాను అన్నారు. ప్రజల ఆశీర్వచనాలు తనకు కావాలి అన్నారు. ప్రస్తుతం పొత్తుల కోసం మాట్లాడే సమయం కాదన్నారు. అయితే తన పొత్తులు జనంతోనే అని స్పష్టం చేశారు. దసరా నవరాత్రుల తరువాత రోడ్లపైకి వస్తామని.. ప్రజా సమస్యలపై పోరాడతాం.. వైసీపీ నేతలను పరుగులు పెట్టిస్తామని ఘాటుగా విమర్శించారు పవన్ కళ్యాణ్.

Pavan Alliance With People
Pavan Kalyan

కొంతకాలంగా దూరం..

గడిచిన సాధారణ ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీజేపీ, జనసేన కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయి. అప్పటివరకూ వామపక్షాలతో కలిసి నడిచిన పవన్ బీజేపీకి స్నేహ హస్తం అందించారు. దీంతో రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఎంతో సంతోషించారు. తమకు ఒక స్టార్ క్యాంపెయినర్ దొరికారని సంబరపడ్డారు. వైసీపీ ప్రభుత్వ వ్యవతిరేక వైఖరిపై పోరాటం చేయడానికి ఇరు పార్టీల నాయకులు ఒక సమన్వయ కమిటీని సైతం ఏర్పాటు చేసుకున్నారు. చాలా అంశాలపై పోరాడారు కూడా. బద్వేలు, తిరుపతి ఉప ఎన్నికల్లో పరస్పరంగా సహకరించుకున్నారు కూడా. అయితే ఇటీవల పవన్ పొత్తుల అంశాన్ని తెరపైకి తెచ్చేసరికి బీజేపీ జనసేనకు దూరం జరుగుతూ వచ్చింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని పవన్ ప్రకటించిన తరువాత బీజేపీలో మార్పు కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని కలుపుకొని వెళితే తప్ప వైసీపీని ఓడించలేమన్నది పవన్ భావన. కానీ టీడీపీతో కలిసి నడవడం బీజేపీకి ఇష్టం లేదు. అదే విషయాన్ని పవన్ కు చెప్పారని.. అందుకు ఆయన నిరాకరించారని తెలుస్తోంది. అందుకే రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడిందన్న టాక్ నడుస్తోంది. పవన్ ప్రకటించిన మూడు ఫార్ములాలు అందులో భాగమని.. బీజేపీ చర్యలతో విసిగిపోయిన ఆయన ఆ పార్టీ నుంచి దూరం జరగడమే మేలని భావిస్తున్నారన్న టాక్ నడుస్తోంది.

రాష్ట్ర బీజేపీకి దెబ్బే..

Pavan Alliance With People
Somu Veeraju

ఒక విధంగా చెప్పాలంటే పవన్ ను వదులుకుంటే రాష్ట్ర బీజేపీ ఒక సంక్లీష్ట పరిస్థితిని కొని తెచ్చుకున్నట్టే. ఆ పార్టీకి నాయకులు కొదువ లేదు. కానీ ప్రజాకర్షణ కలిగిన నాయకులు మాత్రం లేరు. అందరూ మీడియా పులులే. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి రాష్ట్ర నాయకులకు ఇంతో కొంత ప్రాధాన్యత దక్కుతోంది. వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ నాయకులు పోరాటం చేస్తున్నా అందుకు తగ్గ మైలేజ్ రావడం లేదు. ఇందుకు కారణం లేకపోలేదు. బీజేపీ వైసీపీ ఒక్కటేనన్న భావన మాత్రం ప్రజల్లో ఉంది. పవన్ మిత్రపక్షంగా ఉన్న ఆయన మోదీని కలిసిన సందర్భాలు లేవు. అదే వైసీపీ అధినేత జగన్, ఇరత నేతలకు ప్రధాని మోదీని ఇట్టే కలుస్తున్నారు. ఏకంతంగా చర్చలు జరుపుతున్నారు. కానీ పవన్ మాత్రం కలవకపోవడం వారి మధ్య గ్యాప్ ను తెలియజేస్తోంది. కొవిడ్ కారణంగా తాను ప్రధానిని కలవలేకపోయానని పవన్ స్వయంగా చేసిన ప్రకటన కూడా ఈ గ్యాప్ ను తెలియజేస్తోంది. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ అవసరం ఉంది కాబట్టి పవన్ విషయంలో బీజేపీ పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ అయితే నడుస్తోంది. అయితే తమకు అంత బలం లేదని.. పవన్ మేనియాతో మూడేళ్లు బాగానే కొట్టుకొచ్చామని.. ఇప్పుడు పవన్ దూరమైతే తమకు కష్టమన్న బాధ అయితే రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఉంది. కానీ తాము ఒకలా ఆలోచిస్తే అధిష్టాన పెద్దలు మరోలా ఆలోచిస్తున్నారని వారు తెగ బాధపడుతున్నారు.

Also Read: TRS Dissent Leaders: ‘చేతి’లో గులాబీలు.. టీఆర్‌ఎస్‌లో గుబులు!!

ఇదేం స్ట్రేటజీ..

తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో పవన్ బీజేపీ పెద్దలను కలిశారు. వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ పెద్దలు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. జగన్ విషయంలో వారి స్వరం మారినట్టు పవన్ గుర్తించినట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో జగన్ సీఎం అయితేనే మేలు అని వారు భావిస్తున్నట్టు జనసేనాని పసిగట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ అలయెన్ష్ అయితే మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని.. మీకొచ్చే లాభం ఏమిటని బీజేపీ పెద్దలు ప్రశ్నించినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే 2029 ఎన్నికలకు ఆయన వయసైపోతుందని.. అప్పుడు జనసేన, బీజేపీకి బలం పెరుగుతుందని విశ్లేషించారట. అయితే ఈ స్ట్రేటజీని పవన్ వ్యతిరేకించారట. అందుకే అసహనంతో ఢిల్లీ నుంచి వచ్చేశారన్న టాక్ అయితే రాజకీయ సర్కిల్ లో ఉంది. వైసీపీని గద్దె దించుతానని తాను కష్టపడుతుంటే.. బీజేపీ పెద్దలు మాత్రం జగన్ నెత్తిన పాలు పోసేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ బాధపడిపోతున్నారట. మరోవైపు టీడీపీ నుంచి కూడా పొత్తులపై సంకేతాలు రాకపోవడంతో ఇక లాభం లేదనుకుంటున్న పవన్ తానే వైసీపీ ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధపడుతున్నారు.

Also Read: Allu Arjun Pushpa 2: సుకుమార్ కూడా అదే చేస్తే… కెజిఎఫ్ కి పుష్పకి తేడా ఏముంది?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular