Pawan Kalyan vs Jagan: వైసీపీ నేతల్లో అభద్రతా భావం నెలకొందా? ఇటీవల ప్రజావ్యతిరేకత తీవ్రమైందని భావిస్తున్నారా? అటు విపక్షాలు దూకుడుగా వెళుతుండడంతో కలవరం ప్రారంభమైందా? ముఖ్యంగా జనసేనాని పవన్ కామెంట్స్ ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని కలత చెందుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల రాజకీయ పరిణామాలతో అసలు ప్రజల మనుసులో ఏముందో తెలియక అధికార పార్టీ నేతలు తెగ బాధపడిపోతున్నారు. దానిని తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. వలంటీర్లను ప్రయోగించి ప్రజల మూడ్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటం వ్యవహారం,పవన్ కామెంట్స్, చెప్పు చూపిమరీ హెచ్చరించడం వంటివి వైసీపీ నేతల్లో భయాన్ని మరింతగా పెంచుతుండడంతో ఇప్పుడు ఉన్నపళంగా వలంటీర్లకు శిక్షణనిచ్చి మరీ ప్రజల మనసులో ఏముందో తెలుసుకునేందుకు నిర్ణయించారు.

ఇప్పటివరకూ విపక్షాలు ఎన్నిరకాల విమర్శలు చేసినా వాటిని వైసీపీ ప్రజాప్రతినిధులు లైట్ తీసుకున్నారు. సంక్షేమ పథకాల పంచుడుతో ప్రజలు ఫుల్ శాటిష్ ఫైడ్ గా ఉన్నారని భావించారు. కానీ ప్రధాని విశాఖ పర్యటనలో రాష్ట్రానికి ఏ వరాలూ ప్రకటించకపోవడం, పవన్ తో చర్చలు జరపడం, అటు తరువాత జనసేన సోషల్ ఆడిట్ పేరిట దూకుడు పెంచడంతో ఏదో తేడా జరగబోతోందని జగన్ సర్కారు గ్రహించింది. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయన్న ప్రచారం నేపథ్యంలో జగన్ అండ్ కోలో కాస్తా కలవరం ప్రారంభమైంది. అందుకే తాజాగా వలంటీర్లతో సర్వే చేయించనున్నట్టు సమాచారం. రెండు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా వలంటీర్లకు జిల్లా కేంద్రంలో శిక్షణనిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేరా? అన్న విషయాలపై ఎలా ఆరాతీయ్యాలి? వారి నుంచి సమాధానాలు ఎలా రాబెట్టాలి? అన్న అంశాలపై శిక్షణిస్తున్నారు. అయితే వలంటీర్ల నియామకం నుంచి ఇటువంటి శిక్షణలు సహజమే. కానీ ఇప్పుడు ఇస్తున్న శిక్షణ మాత్రం ముమ్మాటికీ భయపడి చేస్తున్నదే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు రోజుల్లో సర్వే నివేదికలు ఇవ్వాలని నిర్ణయించడం కూడా దీని వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మరీ ముఖ్యంగా ఈ సర్వే పవన్ చుట్టూ తిరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రధాన విపక్షం టీడీపీ ఉంది. కానీ చంద్రబాబు కంటే పవనే రాజకీయంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పైగా బీజేపీ పవన్ కు ప్రాధాన్యమిస్తోంది. పవన్ ఇదే దూకుడు పంథాను కొనసాగిస్తే మాత్రం వైసీపీ సర్కారు మరింత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకునే అవకాశముంది. అందుకే జగన్ జాగ్రత్తపడుతున్నారు. ప్రజల మూడ్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఎలా ముందుకెళ్లాలో కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సో ప్రస్తుతం వలంటీర్లకు ఇస్తున్న శిక్షణ రాజకీయాంశాలతో కూడుకున్నదేనని తేలిపోయింది.