పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు. ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో కరోనా బారినపడ్డ పవన్ అప్పటి నుంచి నెలరోజుల పాటు చికిత్స పొందారు. వీక్ అయిపోవడంతో రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా సెకండ్ వేవ్ రావడంతో బయట కనిపించలేదు. చాలా నెలల తర్వాత ఇప్పుడు పవన్ బయటకు వచ్చారు.
జనసేనాని ఈరోజు చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చారు.మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా కోవిడ్ బారిన పడి మరణించిన వారికి సంతాపం తెలిపారు.
నంద్యాలకు చెందిన సోమశేఖర్ కుటుంబానికి రూ.5లక్షల చెక్కును అందజేసి పవన్ ఉదారత చాటుకున్నారు. ఈ సందర్బంగా కరోనా విపత్తులో తొలి, రెండో వేవ్ లలో దేశంలో లక్షలమంది చనిపోయారని.. ప్రతి ఒక్కరికి జనసేన తరుఫున నివాళులు అని పవన్ అన్నారు. జనసైనికులు, వారి కుటుంబ సభ్యులు, నా సన్నిహితులు, బంధువులు చాలా మందిని కోల్పోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టడానికి జనసేన కృషి చేస్తోందన్నారు. అందరి అభిమానం, నాయకుల అండతో జనసేన నిలబడిందని పవన్ అన్నారు. పార్టీ బీమా పథకానికి నేను రూ.కోటి విరాళం ఇచ్చానని.. అందరూ తమ వంతు సహకారం అందిస్తున్నారని పవన్ తెలిపారు.