
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ హీరో అనిపించుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాన్ 2014 ఎన్నికల ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీల తరుపున ప్రచారం చేసిన ఆయన రాజకీయంగా కూడా కొంత మేర సక్సెస్ సాధించాడు. దీంతో 2019 ఎన్నికల ముందు సొంతంగా ‘జనసేన’ పార్టీ పెట్టి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయన ఎంత కష్టపడినా ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగారు. దీంతో రంగులు పూసుకునే వాళ్లకు రాజకీయం కలిసిరాదని కొందరు విమర్శలు చేశారు. అయితే రాజకీయ బుద్ధులు నేర్చుకుంటూ ముందుకుసాగుతున్న పవన్ సంవత్సరం కింద మరోసారి బీజేపీతో కలిసి నడవడానికి సిద్ధమయ్యారు.
మూడేళ్ల విరామం ఇచ్చి ఇటీవల‘వకీల్ సాబ్’తో థియేటర్లకు వచ్చిన పవన్ కల్యాన్ కు ఫ్యాన్స్ నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గలేదని అర్థమైంది. అయితే పొలిటికల్ గా కూడా సక్సెస్ కావడానికి పవన్ గట్టి నిర్ణయమే తీసుకున్నట్లు సమాచారం. రాజకీయాల్లో ఇంట గెలిచి రచ్చ గెలువాలన్న సామెతను బాగా పట్టుకున్న పవన్ ఇక నుంచి బీజేపీతో కలిసి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.
2014లో ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ తరుపున ప్రచారం చేసిన పవన్ 2018లో పార్టీ స్థాపించాడు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాడు. ఈ సమయంలో పవన్ వామపక్షాలతో కలిసి వెళ్లాడు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్క సీటును గెలుచుకున్న ఆయన తీవ్ర నిరాశ చెందాడు. కొన్ని రోజులు ఫాం హౌస్ కు పరిమితమై ఆ తరువాత రైతుల తరుపున పోరాటం చేశారు. అయితే అంతకుముందు తెలంగాణలో జరిగిన రెండు ఎన్నికల్లో బీజేపీతో దోస్తీ కట్టిన పవన్ ఆ తరువాత అక్కడి బీజేపీ నాయకులు చేసిన కామెంట్లకు వారికి దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఖమ్మం మున్సిపాలిటీలో పొత్తు పెట్టుకొని ఏకమయ్యాడు.
ఏపీలోనూ ప్రభుత్వంపై బీజేపీతో కలిసి పోరాటం చేసిన పవన్ పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆ తరువాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల పవన్ కు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పవన్ బీజేపీ అభ్యర్థి తరుపున ప్రచారం చేశాడు..
బీజేపీతో కలిసి ఏపీలో ఎదిగేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాడట. పంచాయతీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసిన చాలాచోట్ల విజయం సాధించింది. దీంతో పవన్ బీజేపీతో కలిసి ఏపీలో ముందుకు సాగాలని డిసైడ్ అయ్యారట… .