Pawan Kalyan- Chandrababu: ఏపీలో వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకమే. అందుకే అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ క్రమంలో సెంటిమెంట్ రగిల్చి ప్రజా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇప్పటికే 40 ఈయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు లాస్ట్ చాన్స్ అని… మరోవైపు పవన్ ఒక చాన్స్ అంటూ స్లోగన్ ఇవ్వడం ప్రారంభించారు. అటు జగన్ సైతం వన్ మోర్ చాన్స్ అంటూ ప్రజలను వేడుకుంటున్నారు. అయితే ఎవరి ప్రయత్నం వారిది. ప్రజలు ఎవర్ని విశ్వసిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. అయితే ఏ పార్టీ వారు తమ అధినేతలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. లెక్కలు వేసుకుంటున్నారు.

అయితే చంద్రబాబు సానుభూతి స్ట్రాటజీపై మాత్రం రకారకాల కథనాలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి. నాలుగు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటు విభజిత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా చాన్స్ కొట్టేశారు. దాదాపు 25 సంవత్సరాలు విపక్ష నేతగా కొనసాగారు. నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా కేంద్రంలోనూ చక్రం తిప్పారు. అయితే ఈ సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో శేష జీవితానికి దగ్గరగా ఉన్న తరుణంలో ఏపీ ప్రజలపై ఆయన సానూభూతి అస్త్రాన్ని పంపించారు. లాస్ట్ చాన్స్ అంటూ తనను తాను తక్కువ చేసుకొని ప్రజల ముందు నిలబడ్డారు. ఇన్నాళ్లూ తాను రాజకీయాల్లో ఉండి చేసిన పనులు చెప్పుకొని ఓటును అడిగినా తప్పు లేదు కానీ.. తనకు ఇంకా పదవీ కాంక్ష ఉందని అర్ధం వచ్చేలా లాస్ట్ చాన్స్ అంటూ అడుక్కోవడం చంద్రబాబు అతిగా సాహసం చేశారని అనిపిస్తోంది. పొరపాటునో.. గ్రహపాటునో ఆయన మాట ప్రజలు మన్నించకుంటే మాత్రం ఆయన రాజకీయ జీవితంలో అదో మాయని మచ్చగా మిగిలిపోనుంది.
అటు పవన్ ఒక చాన్స్ అన్న మాట సహేతుకమేనన్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఏపీలో మెజార్టీ వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. అటు వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తానని పవన్ నమ్మకంగా చెబుతుండడం కూడా ప్రజలను ఆకర్షిస్తోంది. అటు పవన్ కూడా అధికారం కోసం దేబిరించిన సందర్భాలు లేవు. అలాగని పార్టీ పెట్టిన వెంటనే తనకు రాజ్యాధికారం కావాలని అడగలేదు. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ కాలం అవుతోంది. పార్టీ స్థాపించిన తొలినాళ్లలో విభజిత ఏపీకి అనుభవం ఉన్న చంద్రబాబు అవసరమని భావించారు. ఆయనకు సపోర్టు చేశారు. మద్దతు తెలిపానన్న అడ్వాంటేజ్ తీసుకోలేదు. ప్రజా సమస్యల పరిష్కారం పరితపించారు. సాధ్యమైనంతవరకూ పరిష్కారమార్గం చూపారు. అటు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై కూడా పోరాడారు. ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వపై అదే పనిచేస్తున్నారు. దాదాపు పదేళ్ల పాటు పార్టీని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ సీనియార్టీని పెంచుకున్న పవన్ ఒక చాన్స్ అనే మాటకు ప్రత్యర్థులు సైతం అభ్యంతరాలు చెప్పలేకపోతున్నారు.

అయితే ఇప్పుడు చంద్రబాబు సానుభూతి కంటే.. పవన్ నమ్మకం వర్కవుట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు అన్నిరకాల శకునాలు పవన్ కు కలిసివస్తున్నాయి. టీడీపీకి పవనే కావాలి..కేంద్ర పెద్దలకు ఆయనే అవసరం. అందుకే పవన్ కూడా అచీతూచీ వ్యవహరిస్తున్నారు. తనకు అవకాశం దక్కింది కదా అని సంబరపడడం లేదు. ఏపీ ప్రజల ఆలోచన సరళిని మార్చే పనిలో ఉన్నారు. ఇందులో కొంత సక్సెస్ అయ్యారు కూడా. గత ఎన్నికల కంటే జనసేన గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. ఎన్నికల నాటికి మరింత పెరగనుంది. అందుకే విశ్లేషకులు సైతం జనసేన లేని ప్రభుత్వాన్ని ఊహించలేమని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. సో చంద్రబాబు సానుభూతి కంటే ..పవన్ నమ్మకమే ప్రజల్లోకి శరవేగంగా వెళుతోందన్న మాట.