Pawan Kalyan Alliance: పొత్తులపై పవన్ కొత్త ఎత్తు..టిడిపిలో ఆందోళన

ఇప్పటివరకు పవన్ అటు బీజేపీ, ఇటు టిడిపి తో కలిసి నడవాలని భావించారు. అప్పుడే అధికార వైసీపీని ఓడించగలమని చెబుతూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోనివ్వనని తేల్చి చెప్పారు.

Written By: Dharma, Updated On : August 19, 2023 9:34 am

Pawan Kalyan Alliance

Follow us on

Pawan Kalyan Alliance: పవన్ కళ్యాణ్ పొత్తులపై తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టిడిపిలో టెన్షన్ పెంచుతున్నాయి. బిజెపితో పొత్తు, ఎన్డీఏ భాగస్వామి పక్షాలు విషయంలో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం విశాఖలో పవన్ వారాహి యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే.. తాజాగా పొత్తులపై పవన్ చేసిన కామెంట్స్ కాక పుట్టిస్తున్నాయి.

ఇప్పటివరకు పవన్ అటు బీజేపీ, ఇటు టిడిపి తో కలిసి నడవాలని భావించారు. అప్పుడే అధికార వైసీపీని ఓడించగలమని చెబుతూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోనివ్వనని తేల్చి చెప్పారు. అందుకు తగ్గట్టుగానే వ్యూహాల రూపొందించుకుంటూ వచ్చారు. అటు కేంద్ర పెద్దలతో పాటు ఇటు చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసే వెళ్తాయని సంకేతాలు ఇచ్చారు.అయితే తాజాగా పవన్ ఇచ్చిన స్టేట్మెంట్లు ఆలోచింపజేస్తున్నాయి.

తమ మధ్య పొత్తులు చర్చలు దిశగా ఉన్నాయని పవన్ వెల్లడించారు. వచ్చేది జనసేన,బిజెపి ప్రభుత్వమా? లేదంటే మిశ్రమంగా టిడిపి తో జనసేన కలిసిన సంకీర్ణ ప్రభుత్వమా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని పవన్ వెల్లడించారు. అయితే తొలిసారిగా పవన్ నోట బీజేపీ, జనసేన ప్రభుత్వం అంటూ మాట రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టిడిపిలో అనుమానాలను పెంచుతోంది. బిజెపి కీలక నేతలతో పవన్ సన్నిహితం పెరగడం అనుమానాలకు బలం చేకూరుతోంది.

అయితే పవన్ వ్యాఖ్యలు వ్యూహమా? వ్యూహాత్మకమా? అన్న చర్చ ప్రారంభమైంది. సీట్లు పరంగా టిడిపి నుంచి ఆశించినంత సానుకూలత రాకపోవడంతోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 25 సీట్లకు మించి ఇవ్వలేమని టిడిపి నాయకత్వం జనసేనకు తేల్చిచెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో టిడిపిని ఇరుకున పెట్టేందుకు పవన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకే పవన్ అటు బిజెపి, ఇటు టిడిపితోనూ రాజకీయంగా కొత్త ఫార్ములా తో అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. మారిన పవన్ వైఖరితో టిడిపిలో అనుమానాలు పెరుగుతున్నాయి.