Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు తెలియవు.. వ్యూహాలు పన్నలేరు.. అందుకే సరైన విజయం దక్కలేదు.. పవన్ పై విశ్లేషణలు ఇవి. కానీ ఇది తప్పని విశ్లేషకులు తెలుసుకుంటున్నారు. చేతిలో పవర్ లేకుండానే సుదీర్ఘకాలం రాష్ట్రంలో రాజకీయాలు చేసి చూపించారు పవన్. ఉమ్మడి ఏపీలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి చిరంజీవి 18 స్థానాలను కైవసం చేసుకున్నారు. కానీ ఎక్కువ కాలం పార్టీని నడపలేకపోయారు. కానీ పవన్ విషయంలో అలా కాదు. పార్టీని స్థాపించి ఓ ఐదేళ్లపాటు పోటీ చేయలేదు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 135 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒకే ఒక స్థానానికి పరిమితమయ్యారు. తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి చవిచూశారు. అయినా సరే వైసీపీకి, టిడిపికి దీటుగా జనసేన ను మార్చడంలో సక్సెస్ అయ్యారు.
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత భారతీయ జనతా పార్టీకి పవన్ ఒక ఆశాదీపంలా కనిపించారు. పవన్ ద్వారా ఏపీలో బలోపేతం కావాలని బిజెపి ప్రయత్నించింది. ఒకానొక దశలో జనసేన ను బిజెపిలో విలీనం ప్రతిపాదన సైతం వచ్చినట్లు తెలిసింది. అయినా సరే పవన్ ఎక్కడా బిజెపికి చిక్కలేదు. ప్రజల్లో నమ్మకం ఏర్పరుచుకునేందుకు పావులు కదిపారు. రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగారు. బిజెపి కేంద్ర నాయకత్వం జగన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ.. పవన్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేర్చుకుంది. బలమైన మిత్రుడిగా భావించింది. తన నీడలోనే పవన్ ఉంటారని నమ్మకం పెట్టుకుంది. కానీ ఏపీ ప్రజల ఆకాంక్ష మరోలా ఉంది. దీంతో మరో మాటకు తావివ్వకుండా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు పవన్.
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వ సహాయం చాలా అవసరం. అప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కూడా. ఆ విషయం పవన్ కు తెలుసు కనుకే.. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిగా వెళ్తే కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు ఉంటాయని భావించారు. కానీ బిజెపి ముందుకు రావడం లేదు. చేజేతులా వైసీపీకి అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నా నాన్చుడు ధోరణితో ముందుకు సాగుతోంది. పైగా భవిష్యత్తు మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి జగన్ ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. ఇటువంటి తరుణంలో బిజెపి కేంద్ర నాయకత్వానికి ఝలక్ ఇవ్వాలని పవన్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అందుకే ఎన్డీఏకు గుడ్ బై చెప్పనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
ఏపీలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తామన్న పవన్.. తెలంగాణలో మాత్రం ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఏపీ పరిస్థితుల దృష్ట్యా సరిహద్దు జిల్లాలతో పాటు సెటిలర్స్ అధికంగా ఉండే హైదరాబాద్ చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది. అక్కడ సెటిలర్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించడం వ్యూహాత్మకమే. అక్కడ సెటిలర్ల ఓట్లు చీలిపోతే అధికార బీఆర్ఎస్ కు సునాయాసంగా విజయం దక్కుతుంది. అందుకే జనసేన అభ్యర్థులను బరిలోదించినట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల ముంగిట కెసిఆర్ జగన్ కు సహకారం అందించారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకుండా పవన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మీకు సహకరిస్తాం. ఏపీ జోలికి రావద్దు అంటూ ఒప్పందం చేసుకున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అటు తెలంగాణలో జనసేన అభ్యర్థుల ప్రకటన, ఇటు పవన్ బిజెపితో కటీఫ్ ప్రకటన దాదాపు దగ్గరగా వచ్చాయి. పవన్ వ్యూహం లో భాగంగానే ఇలా చేస్తున్నారన్న విశ్లేషణలు మాత్రం వెలువడుతున్నాయి.