
మానవజాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలమని ఈ విషయం గుర్తెరిగి పర్యావరణ పరిరక్షణ కోసం జనసేన కృషి చేస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. మానవ మనుగడకు ఆధారం పంచభూతాలని, నింగి, నీరు, నిప్పు, నెల గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందన్నారు. మన ఆరోగ్యం పర్యావరణంతోనే ముడిపడి వుందని చెప్పారు. చక్కటి పర్యావరణం వున్న చోట ఆసుపత్రుల అవసరమే ఉండదని నిపుణులు చెబుతున్నారని తెలిపారు.
జనసేన మూల సిద్ధాంతాలలో పర్యావరణానికి సముచిత స్థానం కల్పించిన సంగతి మీకు తెలిసిందేనని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని జనసేన కాంక్షిస్తోందన్నారు. అందులో భాగంగానే “మన నది – మన నుడి” కార్యక్రమాన్ని చేపట్టింనట్లు చెప్పారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న జరుపుకుంటున్నామన్నారు. ఈ ఏడాదిలో పర్యావరణాన్ని పరిరక్షించుకోడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకోవలసిన రోజు ఇదేనన్నారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడగానే “మన నది – మన నుడి” కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుకు తీసుకెళతామని తెలిపారు. పర్యావరణానికి హితమైన మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. పర్యావరణాన్ని విషతుల్యం చేసే పరిశ్రమలపై నిరసన గళం వినిపిస్తూనే ఉంటామని చెప్పారు. మనకు ఆరోగ్య ప్రదాయని అయిన పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించాలని కోరారు. మన అడవులు, కొండలు, నదులను మనమే కాపాడుకోవాలన్నారు. పర్యావరణం మనకు కంటికి కనిపించని విలువైన సంపదని పేర్కొన్నారు. ఈ సంపదను మన భావితరాలకు అందించాలని సూచించారు. వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రేమికులందరికీ శుభాభినందనలు తెలిపారు.