
Pawan Kalyan : సినీ రంగంలో పవన్ కల్యాణ్ కెపాసిటీ ఏంటన్నది అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా పవన్ ఉన్నారు. అయినా.. అవన్నీ వదులుకొని ప్రజలకు ఏదో మంచి చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా.. పార్టీ ఒకే ఒక స్థానాన్ని దక్కించుకున్నా.. వెనకడుగు వేయలేదు. ప్రజల మధ్యనే ఉంటూ వచ్చారు. అయితే.. ఆర్థికం విషయానికి వస్తే.. పార్టీని నడపడం అంత తేలిక కాదు. ఒక కార్యక్రమం తీసుకున్నా భారీగా ఖర్చవుతుంది. ఆచరణలో పవన్ కు ఇది ఇబ్బందికరంగా మారింది. అందుకే.. అనివార్యంగా మళ్లీ ముఖానికి రంగు వేసుకోవడానికి సిద్ధమయ్యారు.
సినిమాలను పూర్తిగా వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. తప్పని పరిస్థితుల్లో తిరిగి ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, పార్టీని నడపడానికి తనకు తెలిసిన విద్య సినిమానే అని స్పష్టం చేశారు పవన్. ఆ విధంగా.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ నుంచి ‘వకీల్ సాబ్’ సమ్మర్ లో రిలీజైంది. సాధ్యమైనంత త్వరగా సినిమాలను కంప్లీట్ చేసి, ఎన్నికల ముందు వరకు పూర్తిస్థాయిగా రాజకీయాల్లో నిమగ్నం కావాలనేది పవన్ కల్యాణ్ ప్లాన్. కానీ.. పవన్ లక్ష్యానికి కరోనా అడ్డు పడిందనే చెప్పాలి.
వకీల్ సాబ్ రిలీజ్ తర్వాత ఏకకాలంలో రెండు సినిమాలను పట్టాలెక్కించాడు పవన్. ఉదయం భీమ్లా నాయక్ షూటింగ్ లో, మధ్యాహ్నం హరిహర వీరమల్లు సెట్లో అడుగు పెడుతూ.. సాయంత్రం రాజకీయాలతో బిజీ అయ్యేవారు. ఇంత బిజీ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకొని ముందుకు సాగుతున్న పవన్ కు.. కరోనా పెద్ద దెబ్బే కొట్టిందని చెప్పాలి. నిజానికి భీమ్లా నాయక్ సెప్టెంబరులోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. హరిహర వీరమల్లును సంక్రాంతికి ప్లాన్ చేశారు. అలాంటిది.. కరోనా ఆలస్యం కారణంగా భీమ్లా నాయక్ సక్రాంతికి వెళ్లింది. మరి, వీరమల్లు ఎప్పుడు షూట్ కంప్లీట్ చేసుకొని, థియేటర్లో అడుగు పెడతారో తెలియని పరిస్థితి.
ఈ రెండు చిత్రాల తర్వాత మరో రెండు సినిమాలు చేయాల్సి ఉంది. ఒకటి హరీష్ శంకర్ తో చేస్తున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ కాగా.. ఇంకొకటి సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేయాల్సి ఉంది. ఇవన్నీ ఖచ్చితంగా పూర్తిచేయడం పవన్ కు అవసరం. ఎన్నికల ఏడాదిలో ఖర్చు ఏ విధంగా ఉంటుందో తెలిసిందే. అదంతా భరించాలంటే.. పవన్ సినిమాలు చేయడం అనివార్యం. అయితే.. బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమాలన్నీ పూర్తయ్యేనాటికి 2024 వచ్చేస్తుంది. దీంతో.. పవన్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యేది ఎన్నికల ఏడాదిలోనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, జనసేనాని ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది చూడాలి.