
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేళ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేసిన పవన్.. రాజకీయాలంటే పేకాట క్లబ్బులు నడపడం కాదని, సూట్ కంపెనీలు పెట్టి కోట్లు కొల్లగొట్టడం కూడా కాదని అన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా వ్యక్తిగత ప్రయోజనమే రాజ్యమేలుతోందని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అన్నారు.
స్వాతంత్ర కాలంలో జాతీయ నాయకులు తమ ఆస్తులను త్యాగం చేసి, దేశం కోసం పోరాడితే.. ఇప్పుడు దేశాన్ని దోచుకొని ఆస్తులు కూడ బెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు పవన్. నాటి ఉద్యమ స్ఫూర్తి, సమాజ హితం కోసం పనిచేసే గుణం నేటి తరంలో రావాల్సి ఉందని అన్నారు.
సమాజం మారాలంటే.. ముందుగా మనం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు వేసే ముందు సామాజిక ప్రయోజనాల కోసం చూస్తున్నామా? వ్యక్తిగత ప్రయోజనాల కోసం చూస్తున్నామా? అనేది ఆలోచించాలని కోరారు. జనంలో ఈ విధమైన ఆలోచన వచ్చినప్పుడే రాజకీయ వ్యవస్థ మారుతుందని అన్నారు. ఇవాళ డబ్బు రాజకీయాలు, కుల రాజకీయాలు జోరుగా సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక కులం మీద కక్షగట్టి వేధిస్తే.. రేపు వాళ్లు అధికారంలోకి వస్తే.. మరో కులంపై కక్షగట్టే ప్రమాదం ఉందని అన్నారు. ఇలాంటి రాజకీయాలు, అసమానతలు పోయి, భారతీయులుగా ఉండాలన్నారు.
డబ్బుకు ఓట్లు అమ్ముకునే విధానం.. డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కునే పద్ధతి మారాలన్నారు జనసేనాని. ప్రభుత్వ పథకాలకు అధికారంలో ఉన్నవారి కుటుంబ సభ్యుల పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. మన దేశం కోసం, రాష్ట్రం కోసం పోరాడిన మహనీయులు లేరా? వారి పేర్లు ఎందుకు పెట్టరు? అని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు, పింగళి వెంకయ్య వంటి నేతల పేర్లు కనిపించవా? అని నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే.. జాతీయ నాయకుల పేర్లతోనే పథకాలు పెడతామన్నారు.
తాను 25 సంవత్సరాల భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకొని రాజకీయాల్లోకి వచ్చినట్టు మరోసారి స్పష్టం చేశారు పవన్. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న అసమానతల వల్లే జనసేన ఆవిర్భవించిందన్నారు. రాజకీయాల్లో తాను ఆశించిన మార్పు కోసం కృషి చేస్తానని, తాను వృద్ధుడిని అయ్యేలోపు ఆ మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు పవన్.