Varahi Yatra 3rd Phase: జనసేనలో చేరికలకు నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలకు పట్టుమని పది నెలల వ్యవధి లేకపోవడంతోఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి పడాల అరుణ జనసేన గూటికి చేరారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు సైతం జనసేన బాట పట్టారు. ఆయన బాటలో మరికొందరు ఉన్నట్లు సమాచారం.
ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన కీలక నాయకులు జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం. అప్పట్లో పిఆర్పి తో రాజకీయ అరంగేట్రం చేసిన చాలామంది నాయకులు యాక్టివ్ గానే ఉన్నారు. వివిధ పార్టీల్లో కొనసాగుతున్నారు. 2009 ఎన్నికల్లో వీరంతా 20వేల ఓట్లు పైచిలుకు సాధించిన వారే. వారంతా ఇప్పుడు జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం విశాఖలో వారాహి యాత్ర కొనసాగుతోంది. ఈనెల 19 వరకు కొనసాగుతుంది. అనంతరం కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి.. ఉత్తరాంధ్రలోని మిగతా జిల్లాల్లో పవన్ వారాహి యాత్రను పూర్తి చేయనున్నారు.
విశాఖ నుంచి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, రెహమాన్, ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి డివిజి శంకర్రావు, శ్రీకాకుళం నుంచి డోల జగన్ తదితర నాయకులు జనసేనలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. గత కొద్దిరోజులుగా జనసేన కీలక నాయకులకు వీరు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.అయితే ముఖ్యంగా మత్స్యకార గ్రామాల ప్రజలు జనసేన వైపు చూస్తున్నారు.
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీర ప్రాంతం విస్తరించి ఉంది. 33 నియోజకవర్గాలకు గాను దాదాపు 15 స్థానాల్లో మత్స్యకార ఓటు బ్యాంకు ఎక్కువ. అయితే ఆ గ్రామాల నుంచి అనూహ్యంగా మత్స్యకారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనసేనకు మద్దతు తెలుపుతుండడం విశేషం. విశాఖ వారాహి యాత్రలో సైతం ఎక్కువమంది మత్స్యకార యువతే హాజరవుతున్నారు. మొత్తానికైతే మూడో విడత వారాహి యాత్రలో అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రారంభంలోనే గట్టి సంకేతాలు ఇచ్చారు. పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని తమ చర్యల ద్వారా చూపించారు. దీంతో జన సైనికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.