Pawan Kalyan: పవన్ వారాహి నాలుగో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. వారాహి యాత్రకు సంబంధించి తాజా అప్డేట్ వెలువడడంతో జనసైనికుల్లో ఆనంద వెల్లివిరుస్తోంది. అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత యాత్రను ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్ట్, తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన నేపథ్యంలో యాత్ర పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కృష్ణాజిల్లాలో ప్రధాన నియోజకవర్గాల్లో పవన్ యాత్రను కొనసాగించనున్నారు. ఇప్పటికే మూడు విడతల యాత్రను పవన్ పూర్తి చేసుకున్నారు. తాజాగా టిడిపి తో పొత్తు ప్రకటన తర్వాత నాలుగో విడత యాత్ర జరగనుండడంతో జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో హాజరు కావడం ఖాయంగా తేలుతోంది.
ప్రారంభం నుంచి పవన్ వారాహి విజయ యాత్ర ఏపీ రాజకీయాల్లో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది. తొలి విడత వారాహి యాత్రలో వ్యక్తులపై, రెండో విడతలో వ్యవస్థలపై పవన్ విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. మూడో విడత యాత్రలో ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నాలుగో విడత యాత్రలో మరిన్ని సంచలనాలు నమోదు కావడం ఖాయమని అంచనాలు పెరుగుతున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పవన్ శరవేగంగా స్పందించారు. నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి వెళ్తాయని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం జరిగినా.. సరిగ్గా చంద్రబాబు జైలులో ఉండే సమయంలో పవన్ ప్రకటించడం అందర్నీ ఆకర్షించింది. మరోవైపు చంద్రబాబుకు కోర్టుల్లో బెయిల్ లభించడం లేదు. ఆయన రిమాండ్ కొనసాగుతూ వస్తోంది. రాజకీయ ఒత్తిళ్లతోనే రిమాండ్ కొనసాగిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో పవన్ వారాహి యాత్రలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే వారాహి యాత్రలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. గత మూడు విడతల్లో వారాహి యాత్రకు ప్రజలు ముంచెత్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం తోడు కానుండడంతో వారాహి యాత్ర జన రద్దీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కృష్ణాజిల్లా అవనిగడ్డలో అక్టోబర్ 1 నుంచి పవన్ యాత్ర ప్రారంభం కానుంది. మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే నాలుగో విడత వారాహి యాత్ర నిర్వహణపై కృష్ణాజిల్లా జనసేన నేతలతో నాదెండ్ల మనోహర్ చర్చించారు. అయితే నాలుగో విడత యాత్ర తొలుత రాయలసీమలో జరుగుతుందని అంతా భావించారు. కానీ చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో.. తెలుగుదేశం, జనసేనలకు బలమున్న ప్రాంతాలుగా ఉన్న కృష్ణాజిల్లాలో కీలక నియోజకవర్గాల్లో యాత్ర షెడ్యూల్ను ఖరారు చేశారు. మొత్తానికైతే నాలుగో విడత వారాహి యాత్ర ఏపీ రాజకీయాలను షేక్ చేయనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.