Pawan Kalyan- Chandrababu: ఏపీలో కీలక పరిణామం. చంద్రబాబును రేపు పవన్ కళ్యాణ్ కలవనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రేపు స్నేహ బ్లాక్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలవనున్నారు. జైలులో ఇద్దరు అగ్రనేతలు కలవనున్న క్రమంలో ఎలాంటి అంశాలు చర్చకి రానున్నాయి అనేది హాట్ టాపిక్ గా మారుతోంది.చంద్రబాబుకు మద్దతు తెలిపి.. ధైర్యం చెప్పడానికి జనసేనాని వెళ్తున్నారని సమాచారం. ప్రత్యేక విమానంలో రాజమండ్రి కి వెళ్ళనున్న పవన్.. జైలు అధికారులు ఇచ్చే సమయంలో సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో మూలాఖత్ కానున్నారు.
అయితే ఇద్దరి నేతల కలయిక ఏపీలో పొలిటికల్ హీట్ పుట్టించే అవకాశం ఉంది. వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పవన్ స్పందించారు. అరెస్టును ఖండిస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో.. ఎవరికీ తెలియకుండా రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. అర్థరాత్రి ఏపీ పోలీసుల అడ్డగించడంతో వెనుతిరిగారు. ఇప్పుడు నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించనున్నారు.
చంద్రబాబు భేటీలో కీలక రాజకీయ నిర్ణయాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. వైసిపి పై దూకుడుగా వ్యవహరించేందుకు ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ సర్కార్కు బిజెపి సహకరిస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బిజెపి పెద్దలపై అనుమానపు చూపులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఇండియా కూటమి నుంచి మద్దతు వెల్లువెత్తింది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీతో ఏ విధంగా ముందుకెళ్లాలో చంద్రబాబు, పవన్ లు ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.
చంద్రబాబుతో పవన్ ములాఖత్ కు సంబంధించి పార్టీ వర్గాలు జైలు అధికారులకు దరఖాస్తు అందించినట్లు సమాచారం. చంద్రబాబును పరామర్శించిన తర్వాత.. వారి కుటుంబ సభ్యులను పవన్ కలుసుకునే అవకాశం ఉంది. లోకేష్ తో పాటు భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు లోకేష్ యువ గళం బస్సులో ఉండి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.