
ఎన్నో ఊగిసలాటలు.. మరెన్నో అనుమానాల మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం పాల్గొన్నారు. ప్రారంభం నుంచి బీజేపీ–జనసేనల మధ్య మిత్రుత్వం కొనసాగుతోంది. ఆ రెండు పార్టీలూ ఒకే కూటమిలా ముందుకు సాగుతున్నాయి. అయితే.. కొన్నాళ్ల పాటు తిరుపతి లోక్‌సభ సీటును జనసేన కోరుతూ వచ్చింది. అక్కడ తమ పార్టీకి ఇంతో అంతో ఓటు బ్యాంకు ఉందని చెబుతూ వచ్చింది. కానీ.. ఇందుకు బీజేపీ మాత్రం ససేమిరా అంది. చివరకు ఆ సీటును బీజేపీనే లాగేసుకుంది.
ఇక అప్పటి నుంచి జనసేన–బీజేపీల మధ్య సఖ్యత దెబ్బతిన్నట్లు అనిపించింది. ఒకానొక సందర్భంలో ఈ కూటమి విడిపోతుందా అన్న అనుమానాలూ వచ్చాయి. కానీ.. చివరికి పవన్ కల్యాణ్‌ను ఒప్పించడంలో బీజేపీ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు తిరుపతి బరిలో బీజేపీ క్యాండిడేట్ పోటీలో నిలబడాల్సి వచ్చింది.
ఇన్ని రోజులు షూటింగ్‌లతో బిజీగా ఉన్న పవన్.. నిన్న ఎట్టకేలకు ప్రచారం రంగంలోకి దిగారు. బీజేపీ–జనసేన జైత్రయాత్ర పేరిట తిరుపతిలో భారీ సభ నిర్వహించాయి. వేలాది మంది జనం వచ్చారు. జనసేన అధినేత పవన్ సైతం అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే.. ఇంత పెద్ద స్థాయిలో సభ నిర్వహిస్తే కనీసం ఏ మీడియాలోనూ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ ప్రోగ్రాంను ఆద్యంతం ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా మాత్రమే తెలుసుకోవలసి వచ్చింది.
ఏదైనా ఊరిలో 100 మంది గుమికూడితే వార్తగా ఇచ్చే ప్రధాన చానల్స్ అన్ని.. వేలాది మంది హాజరైన ఈ కార్యక్రమాన్ని పూర్తి గా పక్కన పెట్టేశాయి. పవన్ కళ్యాణ్ సభలని, స్పీచ్‌లను ప్రధాన ఛానెల్స్ పక్కన పెట్టడం ఇవాళ కొత్తేమీ కాదు. ఉన్న ఛానెల్స్‌లో సగం టీడీపీకి పూర్తి అనుకూలంగా, మరికొన్ని ఛానెల్స్ అధికార వైఎస్సార్సీపీకి అనుకూలంగా నడుచుకుంటూ ఉంటాయి. ఇకపోతే మిగిలిన ఛానల్స్‌ని కూడా అధికార పార్టీ నేతలు–కుదిరితే ప్రలోభపెట్టడం, లేదంటే బెదిరించడం ద్వారా జనసేన వాణి ప్రజల్లోకి వెళ్లకుండా బలంగా కృషి చేస్తున్నారు అన్న అభిప్రాయం జనసేన అభిమానుల్లో ఉంది.
తాజాగా నిన్న జరిగిన సభని ప్రధాన ఛానల్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం కూడా ఇదే కోవలోకి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కీలకమైన సమయంలో తెలుగు ఛానల్స్ తమను భారీగా దెబ్బతీశాయని వారు భావిస్తున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తమ పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జనసైనికులు కష్టపడుతున్నారు. జన సేన అధినేత ఉపన్యాసాలు ప్రజల్లోకి వెళితే తమ పార్టీకి ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతోనే అధికార పార్టీ నేతలు ఈ విధంగా చేస్తున్నారని జనసేన అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.