రాజకీయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా.. ఏకంగా పొలిటికల్ కెరీర్ పైనే దెబ్బ పడొచ్చు. అంతలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే.. అన్నీ ఆలోచించి, అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకొని, ఫైనల్ గా ఓ డెసిషన్ కు రావాలి. ఇది.. ప్రతీ నిర్ణయానికీ వర్తిస్తుంది. అయితే.. గతంలో పవన్ తీసుకున్న పలు నిర్ణయాలపై పెదవి విరిచిన వారు ఇప్పుడు శెభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ.. అదేంటో చూద్దాం.
Also Read: ఏపీలో ఎంపీలు వర్సెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు
తిరుపతి ఉప ఎన్నికలో ఎలాగైనా జనసేన పోటీ చేయాలని పవన్ పట్టుదలగా ఉన్నారు. ఏం చేసైనా మిత్రపక్షం బీజేపీని ఒప్పించి, తమ అభ్యర్థినే బరిలో నిలపాలని భావించారు. ఇందుకోసం కమలం పెద్దలతో పలుమార్లు భేటీ అయ్యారు. ఏపీలో బలపడాలనే ఉద్దేశంతో బీజేపీ నేతలు ససేమిరా అన్నట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు.
అయితే.. తాజాగా తిరుపతిలో బీజేపీ పోటీ చేయబోతోందని ఫైనల్ అయ్యింది. దీంతో.. పలువురు జనసేన ఆటలో అరటి పండే అని వ్యాఖ్యానించారు. బీజేపీ పవన్ ను వాడుకుని వదిలేసేందుకు చూస్తోందని అన్నారు. అయితే.. అందులోనూ వ్యూహం ఉందని, పవన్ బెట్టు చేయకుండా.. బీజేపీకి సీటు వదిలేయడం వెనుక కథ వేరే ఉందని అంటున్నారు.
అసలే.. ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ప్రజల మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి దక్కించుకున్న ఫ్యాక్టరీని అమ్మేసేందుకు సిద్ధపడడంతో అందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఏపీ బీజేపీ నేతలు పలుమార్లు చెప్పినా కూడా.. కేంద్రం చెవికి ఎక్కించుకోలేదు. మరోవైపు.. పెట్రో ధరల మంట నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉంది.
Also Read: పదవులకు మేం పనికిరామా..? అన్నీ వాళ్లకేనా..?
ఇలాంటి పరిస్థితుల్లో.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు అంత తేలిక కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాబట్టి.. ఇప్పుడు పవన్ పార్టీ అభ్యర్థి నిలబడ్డా కూడా గెలుపు అంత ఈజీ కాదని అంటున్నారు. ఒకవేళ జనసేన అభ్యర్థి పోటీచేసి, ఓడిపోతే.. పార్టీ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారయ్యేదని, ఈ ఎన్నికల్లో బీజేపీకి సీటు అప్పగించడం ద్వారా పవన్ తెలివిగా వ్యవహరించాడని, రాజకీయాల్లో రాటుదేలాడని అంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్