Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అధికార పక్షం వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కీలక వ్యాఖ్యానాలు చేశారు. ముఖ్యంగా అమరావతి రాజధానిపై నాడు తాను చేసిన వ్యాఖ్యలపై ప్రధాన విపక్షంగా నాడు వైసీపీ చేసిన వ్యాఖ్యానాలు గుర్తుచేస్తూ పవన్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఒకసారి అవకాశమిచ్చిన పర్యవసానానికి అనుభవిస్తున్నారని…రాజధాని లేని రాష్ట్రంగా ఏపీగా మార్చారని అన్నివర్గాల్లో ఆవేదన ఉందని పవన్ గుర్తుచేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయలంలో జరిగిన లీగల్ సెల్ సమావేశంలో పవన్ సుదీర్ఘంగా ప్రసంగించారు.

అమరావతిపై సీఎం నుంచి మంత్రుల వరకూ చేస్తున్న ప్రకటనలు బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తున్నాయని పవన్ విమర్శించారు. ప్రజలు తిరుగులేని విజయాన్ని అందించారని.. వారికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పారు. చట్టసభల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని సీఎం కు చట్టాలు చేసే హక్కు లేదని తేల్చిచెప్పారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చినంత మాత్రాన ఏదైనా చేస్తానంటే కుదరదన్నారు. గతంలో పర్యావరణానికి అనుగుణంగా చిన్న రాజధాని నిర్మించాలని రాజకీయ పక్షం బాధ్యతాయుతమైన సలహా ఇస్తే.. నాడు ప్రధాన విపక్షంగా అమరావతికి 32 వేల భూములు చాలవు అన్నజగన్ ప్రకటనను గుర్తుచేశారు. ఇక్కడే ఇల్లు కట్టి ఉంటానని ప్రజల్లో భ్రమ కల్పించింది మీరు కాదా అని కూడా పవన్ ప్రశ్నించారు. ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల మధ్య విధ్వేషాలను, ప్రాంతీయతత్వాన్ని తెరతీసింది మీరు కాదా అంటూ అధికార పక్షాన్ని పవన్ నిలదీశారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కారుకు ప్రజా గుణపాఠం తప్పదని పవన్ స్పష్టం చేశారు. వైసీపీకి 45 స్థానాలు లోపే దక్కుతాయని అన్ని సర్వేలు తేల్చుతున్నాయని చెప్పారు. జనసేనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను అధికారం దిశగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. బలమైన, గెలిచే సత్తా ఉన్ననాయకులకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయిస్తామని కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు మొదలు పెడతామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేస్తామన్నారు. ఎక్కడ వెనుకబడి ఉన్నామో అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెడతామన్నారు. ఇందు కోసం సమగ్రంగా అధ్యయనం చేస్తామన్నారు. అందుకే అక్టోబరులో చేపట్టాల్సి ఉన్న బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్టు పవన్ ప్రకటించారు.
అటు జగన్ వ్యవహార శైలిపై కూడా పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోదరితో భూముల వివాదం పరిష్కరించుకోవడానికి సమయం ఉంటుంది కానీ.. విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి టైము లేదా అని కూడా ప్రశ్నించారు. కప్పు కాఫీకో, పెసరట్టు ముక్కకో ఆశపడి రాష్ట్ర ఆస్తుల్ని తెలంగాణకు ఇచ్చేస్తారా అంటూ షటైర్ వేశారు. జగన్ తన 300 ఎకరాల సొంత ఆస్తులను కాపాడుకోవడానికి.. వేల ఎకరాలను తెలంగాణకు ధారాదత్తం చేస్తారా అంటూ నిలదీశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.450 కోట్లు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఫిక్స్ డ్ డిపాజిట్ల నుంచి రూ.400 కోట్లు, డ్వాక్రా మహిళల అభయ హస్తం కోసం చెల్లించిన రూ.2000 కోట్ల ప్రీమియం, విపత్తుల విధి నిర్వహణ ఖాతా నుంచి రూ.1100 కోట్లు మళ్లించారని విమర్శించారు. ఇదేనా పాలన అంటూ ప్రశ్నించారు. నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు తప్ప స్థానిక సంస్థల పై చిత్తశుద్ధి లేదని కూడా పవన్ తేల్చేశారు.

వచ్చే ఎన్నికల్లో దౌర్జన్యంతో గెలవాలని చూస్తున్నారని కూడా పవన్ ఆరోపించారు. నామినేషన్ల పర్వం నుంచి దాడులు, దౌర్జన్యాలకు దిగిన సంఘటనలను ఉదహరిస్తూ వచ్చే ఎన్నికల్లో అదే దారిలో నడవాలని నిర్ణయించుకున్నారని పవన్ ఆరోపించారు. అందుకే అధికార పక్షం ఆడగాలను ఎదుర్కోవడానికి అవసరమైతే మిలిడెంట్ మైండ్ సెట్ తో రోడ్డుపైకి వస్తామని కూడా పవన్ గట్టిగానే చెప్పారు. ఆయుధాలతో కాకుండా నోటీ మాటతోనే బదులిస్తామన్నారు. అవసరమైతే న్యాయస్థానాల తలుపు తడతామన్నారు. పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు. న్యాయవ్యవస్థకు మొరపెట్టుకుంటామంటే జడ్జీలపైనే తిరిగి కేసులు వేస్తున్నారని అన్నారు. ప్రతీ వస్తువుకు ఎక్స్ పైర్ డేట్ ఒకటి ఉంటుంది అని.. రాష్ట్రంలో వైసీపీ ఆడగాలకు కూడా అదే వర్తిస్తుందని పవన్ హెచ్చరించారు.
దోపిడీ దుర్మర్గాలకు అలవాటు పడిన వారిని ఎన్నుకుంటే ఇటువంటి పరిణామాలే దారతీస్తాయని ప్రజలకు చురకలు అంటించారు. మనకెందుకులే అనుకుంటే పక్క ఊరిలో, పక్క ఇంట్లో జరుగుతున్న దురాఘతాలు మన ఊరికి, మన ఇంటికి రావడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. దీనిని ప్రజలు తెలుసుకొని బాధ్యతగా మసులుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో రెండుచోట్ల ఓటమి చవిచూస్తే పార్టీ మూసేస్తానని భావించారని..ఎన్ని అవమానాలైనా భరిస్తాను కానీ.. పార్టీని మధ్యలో వదిలే ప్రసక్తే లేదని పవన్ తేల్చిచెప్పారు. మొత్తానికి పవన్ ఈ సమావేశంలో అధికార పార్టీ వైఫల్యాలను గుర్తుచేస్తూనే.. తన రాజకీయ ప్రయాణం పై పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు.
[…] Also Read: Pawan Kalyan: మళ్లీ సమరం మొదలు పెట్టిన పవన్ కళ… […]