
Pawan Kalyan On Telangana: పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణపై అభిమానం చాటుకున్నారు. తెలంగాణ ప్రజల తరుపున నిలబడ్డారు. గట్టి వాయిసే వినిపించారు. ఏ రాజకీయ పార్టీ స్పందించకున్నా బాధ్యత తీసుకొని మరీ మాట్లాడారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా స్టేట్ మెంట్లు ఇచ్చినా.. తెలంగాణ వాదానికి అగౌరవంగా మాట్లాడినా తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య సంవాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలను కించపరుస్తూ ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు హాట్ కామెంట్స్ చేశారు. ఇవి పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇటువంటి తరుణంలో పవన్ స్పందించారు. ఏపీ మంత్రులకు స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. సీఎం జగన్ కట్టడి చేయాలని సూచించారు. ఇప్పుడు పవన్ స్పందనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంత్రుల తాజా వ్యాఖ్యాలతో..
రెండు రాష్ట్రల మధ్య అభివృద్ధిని బేరీజు వేసుకుంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు ఇటీవల మాట్లాడారు. తెలంగాణకు వచ్చిన సీమాంధ్రులు ఇక్కడ పాలన చూసి.. ఇక్కడే ఉంటామని.. తెలంగాణ పౌరులుగా గుర్తించాలని కోరుతున్నారని హరీష్ వ్యాఖ్యానించారు. ఏపీతో పోలిస్తే తెలంగాణ అన్నిరంగాల్లో అగ్రగామిగా ఉందన్నారు. ఏపీలో అభివృద్ధి లేదని చెప్పుకొచ్చారు. దీనిపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు స్పందించారు. మంత్రి అప్పలరాజు ఒక అడుగు ముందుకేసి తెలంగాణ నుంచి సీమాంధ్రులు వెనక్కి వస్తే అక్కడ ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు బుర్రలేదంటూ సంభోదించారు. కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగతంగా కామెంట్స్ చేశారు. దీనిపై సీఎంవో కార్యాలయం స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రెండు రాష్ట్రల మధ్య గ్యాప్ పెంచేలా ఇటీవల పరిణామాలు చోటుచేసుకున్నాయి.
క్షమాపణలకు పవన్ డిమాండ్..
దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ మంత్రల తీరును ఆక్షేపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడినందున బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రి బాధ కలిగించేలా మాట్లాడి ఉంటే.. వ్యక్తిగతంగా స్పందించాల్సి ఉండేదన్నారు. మధ్యలో అక్కడ ప్రజలు ఏంచేశారని ప్రశ్నించారు. ప్రజలకు ఆపాదిస్తూ తెలంగాణ ప్రజలను తిట్టటం..తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. వైసీపీ మంత్రులు అదుపు తప్పి మాట్లాడితే సీఎం స్పందించాలన్నారు. తెలంగాణలో బొత్సా లాంటి వారికి వ్యాపారాలు లేవా అంటూ పవన్ ప్రశ్నించారు. ఇటువంటి కామెంట్స్ సరికాదన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలకు విఘాతం కలిగించేలా కామెంట్స్ దారుణమన్నారు.

సెంటిమెంట్ అస్త్రాలను బ్రేక్ వేసేలా..
ఇష్యూ రేజ్ అయినా ఏ రాజకీయ పార్టీ స్పందించలేదు. ఫస్ట్ టైమ్ పవన్ స్పందించారు. దీనిని తెలంగాణ ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాల కోసమే వ్యూహాత్మకంగా సంవాదానికి దిగాయన్న ప్రచారం నేపథ్యంలో పవన్ గట్టిగానే రియాక్షన్ ఇచ్చారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలను తనకు వ్యక్తిగతంగా మనస్థాపం కలిగించాయని చెప్పుకొచ్చారు. వ్యాఖ్యలు చేసిన వారిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడాలని..తెలంగాణ ప్రజలను కలిపి తిట్టవద్దని పవన్ సూచించారు. ఈ పరిణామాలపై వైసీపీ సీనియర్లు స్పందించాలని డిమాండ్ చేసారు. ఏపీ మంత్రులు, నేతలకు తెలంగాణలో వ్యాపారాలు లేవా అని పవన్ ప్రశ్నించారు. బొత్సా లాంటి వారికి తెలంగాణలో మొన్నటి వరకు కేబుల్ వ్యాపారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మంత్రులు అదుపు తప్పి మాట్లాడితే సీఎం స్పందించాలన్నారు. దీంతో సెంటిమెంట్ తో రాజకీయాలు చేయాలనుకుంటే గట్టి ప్రతిఘటనే తప్పదని పవన్ హెచ్చరించినట్టయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.