
CM Jagan- Minister Appalaraju: ఏపీలో కొందరి మంత్రుల మాటలు చాలా దూకుడుగా ఉంటాయి. సమకాలిన అంశాలపై చాలా స్పీడుగా రియాక్టవుతారు. తమ సొంత శాఖల కంటే రాజకీయాల గురించి మాట్లాడడానికే ఇష్టపడతారు. ప్రత్యర్థులపై అటాక్ చేయడంలో ముందుంటారు. అయితే ఇలా మాట్లాడాలని హైకమాండే ఆదేశిస్తుంది. ఒక లైన్ పెట్టుకొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను తిట్టాలని ఎప్పటికప్పుడు తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ఇస్తుంది. అయితే ఇటీవల ఈ స్క్రిప్ట్ అందుతుండడంలో ఆలస్యమవుతుందో ఏమో కానీ మంత్రుల మాటలు పక్కదారి పడుతున్నాయి. కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఇటీవల జూనియర్ మంత్రి సీదిరి అప్పరాజు చేసిన వ్యాఖ్యలు వికటించాయి. తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయి. దీంతో జగన్ పిలిపించుకొని మరీ క్లాస్ పీకారన్న ప్రచారం జరుగుతోంది.
తీవ్ర వ్యాఖ్యలు..
తెలంగాణ ప్రజలతో పాటు అక్కడి పాలకులపై మంత్రి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు బుర్రలేని వారంటూ కామెంట్ చేశారు. అక్కడితో ఆగకుండా కేసీఆర్ కుటుంబంపై కూడా స్థాయికి మించి వ్యాఖ్యానించారు. తాగుబోతులు, తిరుగుబోతులుగా అభివర్ణించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలను ప్రాంతీయ ఉగ్రవాదులతో పోల్చారు. అయితే ఇవి సహజంగా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుకు కారణమైంది. అదే స్థాయిలో తెలంగాణ మంత్రులు కూడా రియాక్టయ్యారు.దీంతో సీఎంవో మంత్రి అప్పలరాజును వివరణ కోరినట్టు వార్తలు వచ్చాయి. కానీ సీఎం జగన్ నేరుగా అప్పలరాజుకు పిలిపించి చీవాట్లు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఇలా అయితే కష్టమని కూడా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. చెడమడా తిట్టిసినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఇది వాస్తవమా? లేకుంటే తిట్టినట్టు లీకులిచ్చారా? అన్నది తెలియాల్సి ఉంది.
సెంటిమెంట్ కోసమే?
అయితే తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వాదనలు ఎన్నికల్లో సెంటిమెంట్ రగిల్చేందుకేనన్న టాక్ వినిపిస్తోంది. మరో నాలుగు నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఉభయ రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. కేసీఆర్ గట్టెక్కాలంటే బలమైన సెంటిమెంట్ పండాలి. అలాగని నేరుగా ప్రాంతీయ వాదంతో ముందుకెళతామంటే కేసీఆర్ కు కుదిరే పనికాదు. బీఆర్ఎస్ గా మార్చడమే కారణం. అందుకే మరోసారి తనకు సంబంధం లేకుండా ప్రాంతీయ వాదం బయటకు రావాలంటే ఏదో అస్త్రం కావాలి. అందుకే ఏపీ నుంచి ఆ వాదం బయటపడాలంటే సంవాదం జరగాలి. అందులో తెలంగాణ ప్రజలు, పాలకులను తిట్టాలి. ఆ వ్యూహంలో భాగంగానే మంత్రి అప్పరాజుతో అనుచిత వ్యాఖ్యలు చేయించారన్న టాక్ ఒకటి నడుస్తోంది.

లైట్ తీసుకున్న ప్రజలు…
ఇటువంటి వ్యూహాలకు తెలుగు ప్రజలు ఎప్పుడో అలవాటు అయిపోయారు. అందుకే లైట్ తీసుకుంటున్నారు. అది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పనులే అని తేల్చేస్తున్నారు. కేసీఆర్, జగన్ ల మధ్య రాజకీయ అవగాహన ఉందని ఇప్పటికీ నమ్ముతున్నారు. అయితే ఈ వ్యూహం తెలియని మంత్రి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. మీరు మీరు ఏమైనా ఆరోపణలు చేసుకోవాలని..కానీ తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలు రావాలని పిలుపునివ్వడం ఏమిటని.. అదే జరిగితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చే స్టేజ్ లో ఏపీ సర్కారు ఉందా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో మంత్రి అప్పలరాజు బాధితుడుగా మిగిలారు. అటు సీఎం జగన్ నుంచి చీవాట్లు తినాల్సి వచ్చింది. ఇటు ప్రజలు సైతం ప్రశ్నలు, నిలదీతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.