Pawan Kalyan: ‘ఒక్క ఛాన్స్’ ప్లీజ్.. ఈ మాట 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసింది. ఓడిపోయిన సానుభూతి జగన్ కు బాగా కలిసి వచ్చింది. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండన్న జగన్ కోరికను జనాలు మన్నించారు. గద్దెనెక్కించారు. ఎన్నికల్లో సానుభూతి మంత్రం అన్నది ఒక పవర్ ఫుల్ వెపన్. ఓడిపోయిన వారిని ప్రజలు సానుభూతితో గెలిపిస్తారు. 2014లో మోడీ దేశ ప్రజలను కోరింది ఇదే.. 2014లోనూ కేసీఆర్ ప్రాథేయపడ్డది ఇదే.. కార్పొరేటర్ గా గెలిచిన బండి సంజయ్ ఎమ్మెల్యేగా వరుసగా ఓడిపోతే ప్రజలను ఒక్క చాన్స్ అంటే ఏకంగా ఎంపీని చేసేశారు.

ఇలా రాజకీయాల్లో ఓడిన వారిపై ప్రజల్లో కాస్త సానుభూతి ఉంటుంది. ఇప్పుడు ఇదే పవన్ కల్యాణ్ కు బ్రహ్మస్త్రంగా మారుతుంది. 2014లో పోటీచేయకుండా సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ నాడు టీడీపీ-బీజేపీలను గెలిపించారు. ఇక 2019లో ఆ రెండు పార్టీలతో విభేదించి కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి పోటీచేశారు. రెండో చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమితో ప్రజల్లో పవన్ కళ్యాణ్ కు బోలెడంత సానుభూతి దక్కింది.
పవన్ కల్యాణ్ ప్రతీచోట తనను గెలిపిస్తే కదా మీ సమస్యలను అసెంబ్లీలో, పార్లమెంట్ లో గట్టిగా ప్రశ్నిస్తానని అంటుంటారు. ఇప్పుడు తాజాగా విజయనగరం జిల్లాలోని గుంకలంలో కూడా అదే సంచలన ప్రకటన చేశారు. ‘జగనన్న ఇళ్ల’ పరిశీలనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి..ఒకే ఒక్క ఛాన్స్.. అవినీతి రహిత పాలన అంటే ఏమిటీ చూపిస్తా’ అంటూ ప్రజలను కోరారు.
‘నా సొంత జేబులో డబ్బు తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టేవాడిని అవినీతి చెయ్యను ’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపునకు ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. అధికారంలోకి ఎక్కి మరీ పనులు చేయని వారున్న ఈరోజుల్లో తను సినిమాల్లో కష్టపడి సంపాదించిన డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తున్న పవన్ మాటలోని నిజాయితీని ప్రజలు గుర్తించారు. అందుకే ఆయన మాటకు ఇప్పుడు అంత విశ్వసనీయత ఏర్పడింది.

‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ ఏపీ ప్రజలను ప్రాథేయపడ్డ జగన్ కు ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు జగన్ బాటలోనే అదే నినాదం పట్టుకొని అవినీతి రహిత రాజకీయాలు అంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ ను ప్రజలు ఏమేరకు ఆదరిస్తారన్నది వేచిచూడాలి.