Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముందు చూపును ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా ప్రజారాజ్యం పార్టీ నేర్పిన గుణపాఠాలతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల పార్టీలో పదవులు, టికెట్లు విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన వ్యూహాత్మకంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార వైసీపీ చేస్తున్న విష విష ప్రచారానికి పవన్ ఆదిలోనే చెక్ చె ప్పినట్టు అయిందని విశ్లేషిస్తున్నారు.
పవన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. మూడు పెళ్లిళ్లు, ప్యాకేజీ నాయకుడు అంటూ వ్యక్తిగత టార్గెట్ నే అలవాటు చేసుకున్నారు. అయినా అది పెద్దగా వర్కౌట్ కావడం లేదు. పవన్ ఎక్కడా వెనక్కితగ్గడం లేదు. వారాహి యాత్రతో తన గ్రాఫ్ ను అమాంతంగా పెంచుకున్నారు. దీంతో వైసిపికి ఏమీ పాలు పోవడం లేదు. ఈ తరుణంలో ప్రజారాజ్యంనిర్వీర్యానికి జరిగిన ప్రయత్నాలను బయటకు తీస్తున్నారు. నాటి నిందలను జనసేనపై వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిని పవన్ ముందుగానే పసిగట్టి అడ్డుకట్ట వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ విషయంలో రాజకీయ ప్రత్యర్థులు ఒక విష ప్రచారానికి దిగారు. అయితే ఇవి పురుడు పోసుకోకముందే పవన్ వాటిని తుంచేశారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో స్పష్టమైన ప్రకటన చేశారు. ఈసారి అనుభవమున్న నాయకులకు, ఆర్థిక అంగ బలం ఉన్న నేతలను, నియోజకవర్గంలో పట్టున్న వారిని బరిలో దించుతానని పవన్ ప్రకటించారు. ఇలా ప్రకటన చేశారా లేదో? ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా జనసేన టికెట్లు అమ్ముకోనున్నారన్న ప్రచారానికి రాజకీయ ప్రత్యర్థులు పదును పెట్టారు. వ్యూహాలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన సమాచారం పవన్ కు అందడంతో ఆయన విస్పష్ట ప్రకటన చేశారు. జనసేన టిక్కెట్లు, పదవుల విషయంలో పారదర్శకత పాటిస్తామని.. వాటి కోసం ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు. బహిరంగంగానే ప్రకటించి సంచలనం సృష్టించారు. ఏదిఏమైనా ప్రత్యర్థుల వలకు చిక్కకుండా పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.