AP Electricity Employees Strike: గత ఎన్నికల్లో జగన్ కు ఉద్యోగులు అండగా నిలిచారు. ఏకంగా వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. జగన్ పార్టీ తమదే అన్నట్టు వ్యవహరించారు. సిపిఎస్ రద్దు అయిపోతుందని భావించారు. తమ కళ్ళల్లో ఆనందం చూస్తానన్న జగన్ మాటలను నమ్మి అంతులేని మద్దతు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు జగన్ చుక్కలు చూపిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలను తన ఆధీనంలో ఉంచుకొని ఉద్యమాలను నీరుగార్చుతున్నారు. ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులపై సైతం ఎస్మా చట్టం ప్రయోగానికి సిద్ధపడుతున్నారు.
ఏపీలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన బాట పట్టారు. మంగళవారం చలో విజయవాడకు పిలుపునిచ్చారు. తర్వాత సమ్మెకు సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. ఈ తరుణంలో వైసిపి సర్కార్ ఆందోళన చెందుతుంది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రతికూల ప్రభావం ఉంటుందని భావిస్తోంది. విద్యుత్ ఉద్యోగులు రోడ్డు ఎక్కితే ప్రభుత్వంపై వ్యతిరేక భావన పెరుగుతుందని ఆందోళన చెందుతోంది.అందుకే విద్యుత్ ఉద్యోగుల ఉద్యమాన్ని ఎలాగైనా అణచివేయాలన్న ప్రయత్నంలో ఉంది. అందుకే విద్యుత్ ఉద్యోగుల సంఘ నేతలపై ఫోకస్ పెట్టింది. వారి రికార్డులన్నీ తిరగేస్తోంది. వారిలో కొంతమంది పై కేసులు పెట్టి.. అరెస్టు చేయాలన్న భావనలో ఉంది. దీంతో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ సర్కార్ హయాంలో విద్యుత్ ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు దక్కలేదు. చట్ట ప్రకారం రావలసిన కేటాయింపులు కూడా లేవు. ట్రాన్స్కో, జెన్కో పరిధిలో పని చేసే విద్యుత్ ఉద్యోగులకు పిఆర్సి,ఇతర ప్రయోజనాలు కల్పించాలి. గత ప్రభుత్వాలు విద్యుత్ ఉద్యోగుల విషయంలో ఉదారతతో వ్యవహరించేవి. చంద్రబాబు 1998లో విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేశారు. అప్పటి ఒప్పందాలను బట్టి ఆరుసార్లు వేతన సవరణ జరిగింది. ఏడాదికి మూడు వంతున ప్రత్యేక ఇంక్రిమెంట్లు దక్కేవి. చివరగా 2018 మే 31న వేతన ఒప్పందం జరిగింది. 2022 మార్చి 31 వరకు అమల్లో ఉంది.
సాధారణంగా విద్యుత్ శాఖ అంటే రిస్క్ తో కూడుకున్నది.అందుకే అన్ని ప్రభుత్వాలు వీరి విషయంలో ఉదారంగా వ్యవహరించాయి. అయితే వైసిపి మాత్రం వీరి విషయంలో విభిన్నంగా ఆలోచిస్తోంది. వారికి అంత జీతాలు అవసరమా అన్నట్టు భావిస్తోంది. జీతాలు తగ్గించే ఆలోచన చేస్తోంది. దీంతో విద్యుత్ ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది. గత కొద్దిరోజులుగా తాము సమ్మెబాట పట్టనున్నట్లు వారు ప్రకటించారు. అయినా సరే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు ఏకంగా సమ్మెపై ఎస్మా చట్టం ప్రయోగించడానికి సిద్ధపడుతోంది.