
Pawan Kalyan- ABN RK: బావ కళ్ళల్లో ఆనందం కోసం… అక్క మోము లో చిరునవ్వు కోసం బామ్మర్దులు ఏదైనా చేస్తారు.. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం కోసం, లోకేష్ బాబు బావినేతగా వెలుగొందడం కోసం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏదైనా రాస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు.. ఇందులో జర్నలిజం ప్రమాణాలు జాన్తానై గుడ్డ కాల్చామా,మీద వేశామా? అంతే! బాబు ప్రయోజనాలే అతడికి ముఖ్యం.. బాబు అమరావతిని ఏలడమే ముఖ్యం. మిగతావన్నీ అనవసరం.. పేరుకు దమ్మున్న పత్రిక, దమ్మున్న ఛానల్ అని గొప్పలు చెబుతాడు కానీ.. అవన్నీ ఇతరులకు చెప్పేందుకే… తనకు అసలు కాదు. అవి అసలు పాటించడు కూడా.
వెయ్యి కోట్లు ఎవరు ఇచ్చారు?
1000 కోట్లు.. పవన్ కళ్యాణ్ కు సీఎం కేసీఆర్ చూపించిన ఆఫర్. వాస్తవానికి కళ్ళు బైర్లు కమ్మే ఫిగర్ అది.. దీనినే మొన్న వేమూరి రాధాకృష్ణ తన పేపర్లో రాసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ తో రాయబారం నడిపేందుకు కాపు నేతలను వాడుకున్నాడని రాశాడు.. కానీ ఇక్కడ రాధాకృష్ణ తెలుసుకోలేనిది ఏంటంటే.. పవన్ కళ్యాణ్ కు ఆ డబ్బులే కావాలి అనుకుంటే… ఈ రాజకీయాలు అన్ని వదిలేసి దర్జాగా సినిమాలు చేసుకుంటూ వెళ్లేవాడు.. తాను సినిమా చేస్తానని ఓకే చెప్తే బ్లాంక్ చెక్ లు ఇచ్చి వెళ్ళే నిర్మాతలు ఉన్నారు. పైగా తన పార్టీ నడిపేందుకు డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించాడు.. గట్టిగా ఒక పది సినిమాలు చేస్తే చాలు పవన్ కళ్యాణ్ వెయ్యి కోట్లు సులభంగా సంపాదించగలడు. సరైన సినిమా పడితే 500 కోట్లు ఈజీగా కలెక్ట్ చేయగలదు. కానీ ఇవేవీ తెలియని రాధాకృష్ణ కేసీఆర్ వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చాడు, చంద్రబాబును ఓడించేందుకు కంకణం కట్టుకున్నాడు అని తాటికాయంత అక్షరాలతో రాసుకు వచ్చాడు.. పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసిన రాధాకృష్ణ… చంద్రబాబు నుంచి ఎన్ని లక్షల కోట్లు తీసుకుంటే అనుకూలంగా రాతలు రాస్తున్నాడో మాత్రం చెప్పడు.

అదే కసి
నాడు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు రాధాకృష్ణ ఇలాగే రాసుకోచ్చాడు.. ప్రజారాజ్యం పార్టీని ప్రజల్లో పలుచన చేసేందుకు లేనిపోని ఆరోపణలు చేశాడు. అల్లు అరవింద్ డబ్బులు తీసుకుంటున్నాడు అంటూ ప్రచారం చేసాడు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి కోవర్టంటూ సంచలన విమర్శలు చేశాడు. కానీ రాధాకృష్ణ ఇంతచేసినా తన బాబు అధికారంలోకి రాలేకపోయాడు.. ఏనాడూ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని చంద్రబాబును విశ్వవిఖ్యాత రాజకీయ నాయకుడిగా పరిగణించే రాధాకృష్ణ… మిగతా వారి విషయంలో ఎందుకు అంత ఉదారత చూపించడో అర్థం కాదు. రేపు జనసేనకు, తెలుగుదేశం పార్టీకి పొత్తు కుదురుతుంది అని సంకేతాలు వినిపిస్తుండడం, చంద్రబాబు ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ను తొక్కేయాలని చూస్తుండడం, దానికి జనసేనా ని ఒప్పుకోకపోవడంతోనే రాధాకృష్ణ ఈ వెయ్యి కోట్ల డీల్ తెరపైకి తెచ్చాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అబద్ధం ఎంతో నిజమెంతో తెలియదు కానీ… గుడ్డ కాల్చి మీద వేయడంలో మాత్రం రాధాకృష్ణ విజయవంతమయ్యాడు.. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం, జనసేన పార్టీ కౌంటర్ ఇవ్వకపోవడం పట్ల అదేదో గాలికి పోయే పేలపిండి టైప్ వార్త అనేది ఊరకనే అర్థమవుతున్నది.
