
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ మౌనాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? కొద్దిరోజులుగా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అది వ్యూహంలో భాగమా? లేకుంటే కొత్త ఆలోచన చేయబోతున్నారా? అసలు ఆయన వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలవబోతున్నారు? ఆయన మనసులో ఉన్న మాటేమిటి? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి మరి కొద్దిరోజుల్లో క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావ సభలో కీలక ప్రకటన వెల్లడించే చాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తన రాజకీయ ప్రయాణంపై పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చే సమయం ఆసన్నమైందని అటు పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. తన మదిలో ఉన్న ఆలోచనను పవన్ బయటపెట్టేందుకు మచిలీపట్నం వేదిక కానుందని తెలుస్తుండడం పొలిటికల్ వర్గాల్లో హీట్ పెంచుతోంది.
గత కొద్దిరోజులుగా పవన్ పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకల సమయంలో పార్టీ కార్యాలయలంలో గడిపిన పవన్.. తరువాత సినిమా షూటింగ్ లో బీజీ అయ్యారు. అయితే ఈ సమయంలో జనసేనను కార్నర్ గా చేసుకొని అనేక అంశాలు వెలుగుచూశాయి. పవన్ ను అక్కున చేర్చుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నించారని.. ఇందుకుగాను రూ.1000 కోట్లు ఆఫర్ చేశారంటూ ఎల్లో మీడియాలో ప్రచారమైంది. దీనిపై పవన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. కనీసం స్పందించలేదు. దీనిపై జన సైనికులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు రియాక్టయ్యారు. కాలమ్ రాసిన ఏబీఎన్ ఆర్కే తీరును పరోక్షంగా ఎండగట్టారు. అయితే తాను కేసీఆర్ ఆఫర్ చేశారని మాత్రమే రాశానని.. పవన్ తీసుకున్నారని రాయలేదని ఆర్కే మరోసారి తన కాలమ్ ద్వారా జన సైనికులకు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇది చంద్రబాబుకు తెలియకుండా జరగదని..అందుకే చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా పవన్ అందుబాటులోకి రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

అటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పవన్ విషయంలో విరుద్ధ ప్రకటనలు చేస్తోంది. పవన్ తమవాడేనని.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసే ప్రయాణం చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా ప్రకటించారు. అయితే అందుకు విరుద్ధ ప్రకటన చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పవన్ తమకు అవసరం లేదన్నారు. తరచూ కేసీఆర్ పాలనను మెచ్చుకునే పవన్.. తరచూ కేటీఆర్ ను కలుసుకున్న పవన్ సపోర్టు తమకు అక్కర్లేదని తేల్చేశారు. కానీ సోము వీర్రాజు మాత్రం అందుకు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన సపోర్టు తమకేనని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆరు నూరైనా జనసేనతో బీజేపీ కలిసి వెళుతుందని తేల్చేశారు.
ఏపీ సీఎం జగన్ కూడా పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెనాలిలో జరిగిన రైతుభరోసా, పీఎంకిసాన్ నిధుల విడుదల సందర్భంగా జరిగిన సభలో సవాల్ చేశారు. అందరూ కలిసి కాదు.. విడివిడిగా రండి తెల్చుకుందామంటూ తొడగొట్టారు. పవన్ ను మరోసారి దత్తపుత్రుడంటూ తూలనాడారు. అయితే అటు పొత్తులు, దత్తపుత్రుడు కామెంట్స్ పై పవన్ పలుమార్లు గట్టి హెచ్చరికలే పంపారు. తాను ఎవరితో కలిస్తే మీకేందుకుని కూడా ప్రశ్నించారు. మరోసారి దత్తపుత్రుడు అని అంటే తనదైన రీతిలో సమాధానం ఉంటుందని హెచ్చరించారు. కానీ జగన్ మాత్రం రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు.పవన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే వీటిన్నింటిపై పవన్ స్పందించ లేదు. కనీసం పత్రికా ముఖంగా కూడా ప్రకటన చేయలేదు. దీంతో పవన్ రాజకీయ వ్యూహం మార్చారా? అంటూ అనుమానం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మార్చి 14న జనసేన పదో ఆవిర్భావ సభ మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది. అదే రోజు పవన్ తన వారాహి వాహనాన్ని అధికారికంగా రోడ్డుపైకి తెస్తుండడం కూడా అందరి అంచనాలను పెంచుతోంది. ఇప్పటివరకూ జరిగిన పరిణామాలపై పవన్ స్పష్టతనిచ్చే అవకాశముంది. మరీ ముఖ్యంగా పొత్తులు, బీజేపీ నాన్చుడు ధోరణి, టీడీపీతో వెళితే ఎందుకు వెళ్లాల్సి వస్తోంది? వైసీపీపై ఏవిధంగా పోరాటం? అన్న అంశాలపై క్లారిటీ ఇచ్చే చాన్స్ ఉంది. జనసేన ఆవిర్భావ సభ గురించి వెల్లడించిన నాదేండ్ల మనోహర్ వైసీపీ విముక్త ఏపీయే ధ్యేయంగా సభ ఉండబోతుందన్న ప్రకటన చూసి.. ఇక జరగబోతోంది యుద్ధమేనన్న సంకేతాలిచ్చినట్టయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు.