Pawan Kalyan – Kapu Community : కాపులు.. ఏపీలో మెజార్టీ ప్రజలు.. జనాభాలోనే అత్యధికంగా ఉన్న వీరిలో అనైక్యత వారికి శాపం. ఏపీ రాజకీయాలను శాసించే వీళ్లు ఇప్పటివరకూ ఒక ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు. రాజ్యాధికారం సాధించలేదు. ఇదే విషయాన్ని పవన్ లేవనెత్తారు. ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాపులకు సంచలన పిలుపునిచ్చారు.
మచిలీపట్నం వేదికగా జరుగుతున్న జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు సంచలన పిలుపునిచ్చారు. ఆవిర్భావ వేదికగా పలు కీలక అంశాలపై పార్టీ కేడర్ కు దిశా, నిర్దేశం చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న కాపులు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ వేదికగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని క్రిమినల్ రాజకీయాలకు చరమగీతం పాడాలంటే కాపుల నడుం బిగించాలని, మిగిలిన కులాలు ఆ దిశగానే అడుగులు వేస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాపులే రాష్ట్ర రాజకీయాల దిశా, దశను మార్చే బలమైన శక్తులుగా ఉన్నారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాపులు మార్పు దిశగా ఆలోచిస్తూ మిగిలిన కులాలు అదే దిశగా అడుగులు వేస్తాయని ఆయన స్పష్టం చేశారు. కులాలకు, మతాలకు అతీతంగా ఉండే వ్యక్తిని, తాను విశ్వ నరుణ్ణి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు కోసం కాపులను పెద్దన్న పాత్ర పోషించేలా కోరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
గుండెల్లో పెట్టుకుంటా మంటున్న తెలంగాణ అభిమానులు..
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఇక్కడ జనసేన పార్టీ లభిస్తున్న ఆదరణ పట్ల తెలంగాణలోని తన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సభ వేదికగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిమితమై తప్పు చేశారని, తెలంగాణకు వస్తే తమ గుండెల్లో పెట్టుకుంటామని వారు చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సభ వేదికగా గుర్తు చేశారు.
గోబెల్స్ ప్రచారం నమ్మవద్దు..
పవన్ కళ్యాణ్ డబ్బులకు అమ్ముడుపోయాడంటూ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, డబ్బులు అవసరం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసిపి నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, ప్రచారాలను నిర్వహించే వ్యక్తులు గోబెల్స్ మాదిరిగా అడ్డగోలుగా జనసేన మీద మాట్లాడితే దిక్కులేని బతుకులవుతాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రోజుకు రెండు కోట్లు సంపాదించే వ్యక్తిని, నాకు డబ్బులు అవసరం లేదని, నిజాయితీగా ఉంటానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తన నిజాయితీ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరము లేదని వెల్లడించారు.
గుండెల్లో పెట్టుకుని ఓటేయండి..
సభలో సమావేశాలకు వచ్చినప్పుడు తనకు గజమాలతో సత్కారాలు వద్దని, గుండెలు బాదుకోవద్దని, గుండెల్లో పెట్టుకుని ఓటేయాలని అభిమానులను పవన్ కల్యాణ్ కోరారు. జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలమైన శక్తిగా ఆవిర్భవించిందన్న నమ్మకం కుదిరితే ఒంటరిగా వెళ్లేందుకు వెనుకాడబోమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.