Pawankalyan : ఏపీలో ఎన్నికల ఫీవర్ ప్రారంభమైంది. అన్ని పార్టీలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ప్రజా మద్దతు కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ ప్రజల బాట పట్టింది. గడపగడపకూ మన ప్రభుత్వం పేరుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దండు కట్టారు. గ్రామాలను చుట్టేశారు. జగనన్న నువ్వే మా నమ్మకం అంటూ మరో కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. ఇంటింటా స్టిక్కర్లు అతికించే కార్యక్రమాన్ని పూర్తిచేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్నారు. కుమారుడు లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇక జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇటీవలే చంద్రబాబుతో చర్చలు జరిపారు. నాగబాబు, నాదేండ్ల మనోహర్ లు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ పార్టీ బలోపేతం పై ఫోకస్ పెంచారు.
పొత్తులపై సానుకూలత..
అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పడిప్పుడే ఒక పిక్చర్ వస్తోంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తులపై సానుకూల ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీట్ల ఇచ్చి పుచ్చుకోవడంపై ప్రాధమిక అవగాహనకు వచ్చినట్టు టాక్ నడుస్తోంది. కొద్దిరోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. మొన్నటికి మొన్న చంద్రబాబును పవన్ కలిశారు. ఇరువురి నేతలు చర్చించుకున్నారు. కానీ ఏ అంశం గురించి మీడియాతో మాట్లాడలేదు. కేవలం చర్చలకు సంబంధించి ఫొటోలను మాత్రమే షేర్ చేసుకున్నారు. కానీ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిపోయిందంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం మొదలుపెట్టింది.
ఈ పనిచేస్తేనే మేలు..
పొత్తుల విషయంలో పవన్ అచీతూచీ వ్యవహరించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. గౌరవానికి తగ్గట్టు సీట్లు తీసుకోవాలంటున్నారు. అంతకు ముందే ఒక సమగ్ర నివేదిక రూపొందించుకుంటే మంచిదని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నియోజకవర్గాలు ఎన్ని? ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఆ నియోజకవర్గాల్లో సాధించిన ఓట్లు ఎంత? అక్కడ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి? జన సైనికులు, అభిమానుల ప్రభావమెంత? అన్నది గ్రౌండ్ వర్క్ చేసుకుంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. పొత్తుల చర్చల సమయంలో ఈ నివేదిక కీలకమవుతుందని.. ఇటువంటి సమగ్ర నివేదకలకే చంద్రబాబు ప్రాధాన్యమిస్తారని.. సీట్లపరంగా జనసేనకు మంచి జరుగుతుందని ఎక్కువ మంది సూచిస్తున్నారు.
అదే పనిలో జనసేన..
అయితే ఇప్పటికే జనసేన గ్రౌండ్ వర్కు ప్రిపేర్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నేతలతో వర్చువల్ విధానంతో తరచూ మాట్లాడుతున్నారు. అక్కడ లోటుపాట్లు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో మరో కీలక నేత నాదేండ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో పర్యటనకు దిగుతున్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలపై ఆరాతీస్తున్నారు. ఒక నివేదిక రూపొందిస్తున్నారు. మొత్తానికైతే విశ్లేషకులు సూచిస్తున్నట్టు పవన్ లెక్క ప్రిపేర్ చేసుకుంటున్నారు.