Pawan Kalyan : శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. యువశక్తి కోసం అహర్నిశలు శ్రమిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడతామని తేల్చి చెప్పారు. పట్టుమని పది మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ఉంటే ప్రభుత్వం పై అలుపెరుగకుండా పోరాడేవాడినని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా పోరాటం ఆగదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తామని చెప్పారు.

రణస్థలంలో జరిగిన యువశక్తి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు జనసేన నుంచి గెలిచి ఉంటే ప్రభుత్వం తలలు వంచేవాడినని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల తరపున పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర పై ప్రేమ ఉంటే రోడ్లు వేయాలని, ఉద్ధానం బాధితులకు ఆపన్నహస్తం అందించాలని, పరిశ్రమల కాలుష్యం తగ్గించాలని డిమాండ్ చేశారు. సొంత ప్రజయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
2024 ఎన్నికల్లో జనసైనికులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. జనసైనికులు పోరాడితేనే మార్పు వస్తుందని, కులం.. గోత్రం పేరుతో అవినీతిపరులకు ఓటువేస్తే మరో ఐదేళ్లు నష్టపోతారని తెలిపారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇనుపకండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత తనకు కావాలని అన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే నాయకుల్ని ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఓట్లను చీలనివ్వను అన్నది ఏపీ అభివృద్ధి కోసమని తేల్చి చెప్పారు. ఓట్ల చీలిక వల్ల 2019లో 50కి పైగా స్థానాల్లో వైసీపీ గెలిచిందన్నారు. మరోసారి విచ్ఛిన్నకారులకు అధికారం ఇస్తే రాష్ట్రం, యువత నాశనమైపోతుందని హెచ్చరించారు. యువత పోరాడితే సాధ్యమవుతుందన్నారు. ఉదయం అమ్మ ఒడి ఇస్తూ.. రాత్రికి నాన్న బుడ్డి ఇస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయం జనసేన చేయదని, కులాలను కలిపే రాజకీయం చేస్తుందని చెప్పారు. 2024లో అధికారం ఇస్తే అభివృధ్ది చేసి చూపిస్తామని అన్నారు. పంచాయతీల నిధులు దారి మళ్లించమని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు చేసి చూపిస్తామని మాట ఇచ్చారు.